ఖమ్మం, డిసెంబర్ 6: బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అందేద్కర్ భరతమాత ముద్దుబిడ్డ అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో ఆయన బాటలోనే ఉద్యమనేత కేసీఆర్ పయనించారని గుర్తుచేశారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన రాజ్యాంగ నిర్మాత వర్ధంతి సభకు ఆయన హాజరయ్యారు. ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యేలు రాములునాయక్, సండ్ర వెంకటవీరయ్య, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అజయ్ మాట్లాడుతూ.. దేశంలోనే అత్యంత ఎత్తయిన బీఆర్ అంబేదర్ విగ్రహాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పిన ఘనత, తెలంగాణ పరిపాలన భవనం సెక్రటేరియట్‌కు డాక్టర్ బీఆర్ అంబేదర్ పేరు పెట్టి ఆ మహనీయుడిని గౌరవించుకున్న చరిత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
గెలిస్తే పొంగేదిలేదు..ఓడితే కుంగేది లేదు..: అజయ్
ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని, ఎన్నికల్లో గెలుపోటములు సాధారణమేనని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. గెలిస్తే పొంగేదిలేదని, ఓడితే కుంగేదిలేదని స్పష్టం చేశారు. ఖమ్మంలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జనగామ జిల్లా అధ్యక్షుడు, అక్కడి జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి (55) మృతి పట్ల ఏర్పాటు చేసిన సంతాప సభలో ఆయన మాట్లాడారు. సంపత్‌రెడ్డి మరణం పార్టీకి తీరని లోటని, ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగఢ సానుభూతిని తెలియజేస్తున్నామని అన్నారు. నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. అనంతరం పార్టీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో హాజరైన కార్యకర్తలను ఒక్కొక్కరిని కలిసి ఓటమి గురించి బాధపడవద్దని ధైర్యం చెప్పారు.
శ్రేణులు అధైర్యపడొద్దు: తాతా మధు
అనంతరం ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. ఓటమి ఎదురైనంత మాత్రాన పార్టీ శ్రేణులు అధైర్యపడాల్సిన పనిలేదని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు అన్నారు. ఓటమి చెందినప్పటికీ ప్రజాక్షేత్రంలోనే ఉందామని, శ్రేణులకు అండగా నిలుద్దామని అన్నారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పునుకొల్లు నీరజ, కూరాకుల నాగభూషణం, దోరేపల్లి శ్వేత, ఉప్పల వెంకటరమణ, బెల్లం వేణు తదితరులు పాల్గొన్నారు.