ఖమ్మం, జనవరి 4 : ‘రాబోయే కాలంలో విజయాలన్నీ మనవే. అందుకే, ఉత్సాహంతో ముందుకు వెళ్లాలి’ అని బీఆర్ఎస్ నాయకులు-ప్రజాప్రతినిధులను మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కోరారు. వారితో ఆయన గురువారం ఖమ్మంలోని తన నివాసంలో సమావేశమయ్యారు. ఎన్నికల్లో గెలుపోటములు సాధారణమేనని అన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికలు ఒక భాగం మాత్రమేనని, ప్రజల తీర్పును గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
వచ్చే ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అధిష్టానం మేరకు పని చేయాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల సమాయత్త సమావేశాన్ని ఈ నెల 9న హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహిస్తారని చెప్పారు. ప్రతి నియోజకవర్గం నుంచి 100 మంది ముఖ్యులు తప్పక హాజరుకావాలన్నారు. సమావేశంలో మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఆర్జేసీ కృష్ణ, భీరెడ్డి నాగచంద్రారెడ్డి, మద్దినేని వెంకటరమణ, తాళ్లూరి జీవన్ కుమార్, వైస్ ఎంపీపీ గుత్తా రవి, నున్నా మాధవరావు, తాజుద్దీన్, శీలంశెట్టి వీరభద్రం, ఇస్సాక్, షౌకత్ అలీ, వీరూనాయక్ తదితరులు పాల్గొన్నారు.