ఖమ్మం, నవంబర్ 21: మొలకెత్తనివ్వబోవనడానికి కేసీఆర్ మొక్క కాదని, మహా వృక్షమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. కేసీఆర్‌ను తుడిచిపెట్టడం రేవంత్‌కు కాదు కదా.. అతడి జేజమ్మకు కూడా వల్ల కాదని గుర్తుంచుకోవాలని హితవుచెప్పారు. ఉద్యమ సమయంలో ఉద్యమకారులను అణిచేందుకు జేబులో రైఫిళ్లు పెట్టుకొని తిరిగిన రేవంత్.. కేసీఆర్‌ను లేకుండా చేస్తానంటూ ఢాంబికాలు పలుకుతుండడం విడ్డూరంగా ఉందని అన్నారు. లగచర్ల గిరిజన రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఖమ్మంలో కొవ్వొత్తులతో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ.. రేవంత్‌కు ఇచ్చిన రూ.100 కోట్లు అమెరికాలో అదానీ దోచుకున్న రూ.2 వేల కోట్లలోవేనా అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలోనే చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి లాంటి ముఖ్యమంత్రులే కేసీఆర్‌ను ఏమీ చేయలేకపోయారని గుర్తుచేశారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి వల్ల మాత్రం ఏమవుతుందని ఎద్దేవా చేశారు. కేసులు, జైళ్లు వంటివి కేసీఆర్‌కు, బీఆర్ఎస్కు, పార్టీ క్యాడర్‌కు కొత్తేమీ కాదని స్పష్టం చేశారు. వాటికి భయపడేవాళ్లమే అయితే తెలంగాణనే వచ్చేది కాదని తేల్చిచెప్పారు. ఉద్యమకారులను అణచివేసిన రేవంత్‌కు ఉద్యమమంటే ఏంటో చూపించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు. ఉచిత హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌కు తన సీటును కాపాడుకోవడమే సరిపోతోందని విమర్శించారు.
సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోని లగచర్ల ప్రాంతంలో గిరిజన భూములను ఫార్మాసిటీ పేరుతో దోచుకోవడమే పనిగా రేవంత్‌రెడ్డి సోదరులు పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. అడ్డొచ్చిన వారిని తొక్కుకుంటూ, ఎదిరించిన వారిపై కేసులు పెట్టుకుంటూ వెళ్తున్నారని అన్నారు. ఫార్మాసిటీకి తమ భూములను ఇవ్వబోమంటూ 9 నెలలుగా పోరాడుతున్న లగచర్ల గిరిజన రైతులకు కేటీఆర్, నరేందర్‌రెడ్డి మద్దతు నిలిచారని అన్నారు. అందుకు కేటీఆర్‌ను లోపలేస్తానంటూ రేవంత్ నీతిమాలిన మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో బాంబులు పేలతాయంటూ ఖమ్మానికి చెందిన ఓ మంత్రి ప్రగల్భాలు పలికారని, చివరికి అవి సీఎం నియోజకవర్గంలో పేలాయని ఎద్దేవా చేశారు.
రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. అదానీపై రాహుల్‌గాంధీ పార్లమెంట్లో విమర్శలు చేస్తుంటే.. రేవంత్‌రెడ్డి మాత్రం అదానీకి ఎందుకు ఒత్తాసు పలుకుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలుచేసే వరకూ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. మణిపూర్ గిరిజన ప్రజలపై హింసకు వ్యతిరేకంగా పార్లమెంటులో పోరాడుతున్న రాహుల్‌గాంధీ.. తెలంగాణలోని లగచర్ల గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు.
ఈ నెల 25 నుంచి జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఇదే విషయంపై బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టంచేశారు. పదేళ్ల గులాబీ పార్టీ పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ సర్కారు పద్ధతినే అవలంబించి ఉంటే రేవంత్, భట్టిలు పాదయాత్రలు చేయగలిగేవారేనా? అని ప్రశ్నించారు. మహబూబాబాద్‌లో కేటీఆర్ చేపట్టిన మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరింపజేస్తే.. హైకోర్టు అనుమతిచ్చిందని అన్నారు. దీంతో రెట్టింపు సంఖ్యలో ప్రజలతో ధర్నా చేస్తామని స్పష్టంచేశారు.
ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డికి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఫోబియా పట్టిందని విమర్శించారు. ఈ మానసిక వ్యాధి తగ్గాలంటే ఆయన వెంటనే అసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశంలోనే అత్యధిక బూతులు మాట్లాడే సీఎంగా రేవంత్‌రెడ్డి చెడ్డ పేరు తెచ్చుకోవడంతో తెలంగాణ ప్రజలు తల ఎత్తుకోలేకపోతున్నారని అన్నారు. కేసీఆర్‌ను చంపుతానని, తుడిచివేస్తానని అనడం సీఎం స్థాయికి తగదని అన్నారు.
సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రేవంత్ సర్కారు నిరంకుశ విధానాలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కేసీఆర్, కేటీఆర్‌లను టార్గెట్ చేయడమే రేవంత్ పనిగా పెట్టుకున్నారని అన్నారు. హామీలు అమలు చేయని రేవంత్‌రెడ్డిని గద్దె దించే వరకు బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు రాకేశ్‌రెడ్డి, కొండబాల కోటేశ్వరరావు, కూరాకుల నాగభూషణం, పగడాల నాగరాజు, ఆర్జేసీ కృష్ణ, బొమ్మెర రామ్మూర్తి , పలువురు కార్పొరేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో 11 నెలలుగా నెలకొన్న ఆగ్రహం ఒక్కసారిగా వ్యక్తమైంది. కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నేరవేర్చకుండా కాలయాపన చేస్తోందని అన్ని వర్గాల ప్రజలు మండిపడుతున్నారు. శుభకార్యాలు, అశుభ కార్యాల వద్ద ఏ నలుగురు కూడినా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపైనే చర్చించుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉంటే ఇలా ఉండేది కాదంటూ మాట్లాడుకుంటున్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రతిపక్ష నేతలపై జుగుప్సాకరమైన భాషను వినియోగిస్తున్నారని అనుకుంటున్నారు.
ఈ క్రమంలో బీఆర్ఎస్ కూడా ప్రజాక్షేత్రంలోకి రావడంతో ప్రజలంతా మద్దతుగా వస్తున్నారు. ఈ నేపథ్యంలో లగచర్ల గిరిజన రైతుల ఉద్యమానికి సంఘీభావంగా బీఆర్ఎస్ శ్రేణులు గురువారం ఖమ్మంలో నిర్వహించిన ర్యాలీకి రైతులు, గిరిజన మహిళలు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. మయూరిసెంటర్ నుంచి ర్యాలీ మొదలుకాగా.. ముగింపు ప్రదేశం వరకూ రహదారి కిక్కిరిసిపోయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, లగచర్ల రైతులకు మద్దతుగా రైతులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ర్యాలీ విజయవంతంతో బీఆర్ఎస్లో జోష్ పెరిగింది.
లగచర్ల గిరిజన రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు కదం తొక్కారు. ఏ ఒక్క రైతు సాగు భూమికి నష్టం వాటిల్లకుండా అండగా నిలబడతామన్నారు. ఫార్మా కంపెనీకి రైతుల భూములను తీసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంతకైనా పోరాడుతామని ప్రతినబూనారు. బీఆర్ఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం నగరంలోని మయూరి సెంటర్ నుంచి జడ్పీ సెంటర్ వరకు బీఆర్ఎస్ శ్రేణులు దండు కట్టి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీకి బీఆర్ఎస్ నేతలు, నాయకులు, కార్యకర్తలతోపాటు రైతులు, గిరిజన మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గత కేసీఆర్ పాలనలో పదేళ్లు కంటికి రెప్పలా కాపాడుకున్న రైతుల జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఫార్మా కంపెనీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినదిస్తూ ముందుకు సాగారు.