ఖమ్మం, ఆగస్టు 4: పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడే కార్యకర్తలు అండగా నిలవాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సూచించారు. అలాగే కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని, అందులో తాను ముందువరుసలో ఉంటానని స్పష్టం చేశారు. కార్యకర్తలే పార్టీకి బలమని, మనమందరమూ కేసీఆర్ ఆర్మీ సైన్యమని అన్నారు. గులాబీ జెండాకి ఉన్న ధైర్యం, నిజాయితి మరే పార్టీకీ లేవని స్పష్టం చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ ప్రజల సమస్యల కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు. కొంతకాలంగా చికున్‌గున్యాతో భాదపడుతున్న అజయ్‌కుమార్ ఆదివారం ఖమ్మం వచ్చారు.
నగరంలోని మమత ఆసుపత్రి ఆవరణలో ఉన్న తన స్వగృహంలో ఉన్న ఆయనను బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి కలిశారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి ఆయన మాట్లాడారు. పార్టీ ఏ పిలుపు ఇచ్చినా అందుకొని ప్రజల కోసం పోరాడుదామని అన్నారు. ఉద్యమసారథి కేసీఆర్.. వీరోచితంగా పోరాడి తెలంగాణను సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి.. అనేక ప్రజాకర్షక పథకాలు అమలుచేశారని గుర్తుచేశారు.
అయితే పార్టీ అధికారంలో లేకుండా కష్టకాలంలో ఉన్నప్పుడే పార్టీకి మనం అండదండగా ఉండాలని సూచించారు. పదవుల కోసం పార్టీ మారే వాళ్లకు నిబద్ధత ఉండదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్యం మీద ప్రజలు నమ్మకం కోల్పోయారని స్పష్టంచేశారు. పార్టీ శ్రేణులపై ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, జైళ్లలో వేసినా ధైర్యంగా ఉండాలని సూచించారు.
క్యాడర్‌కు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు పగడాల నాగరాజు, వీరూనాయక్, కూరాకుల నాగభూషణం, కర్నాటి కృష్ణ, కూరాకుల వలరాజు, నాగండ్ల కోటేశ్వరరావు, దాదె అమృత, పల్లా రోస్ లీనా, డోన్వాన్ సరస్వతి, పగడాల శ్రీవిద్య, రుద్రగాని శ్రీదేవి, కన్నం వైష్ణవి, పసుమర్తి రామ్మోహన్, జ్యోతిరెడ్డి, బచ్చు విజయ్‌కుమార్, తోట రామారావు, మాటేటి నాగేశ్వరరావు, చిరుమామిళ్ల నాగేశ్వరరావు, దనాల శ్రీకాంత్, తోట వీరభద్రం, కొత్త వెంకటేశ్వరరావు, వేములపల్లి వెంకటేశ్వరరావు, మేకల సుగుణా రావు, నరేందర్, గుత్తా రవి, మందడపు నరసింహారావు, లక్ష్మణ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.