రఘునాథపాలెం, డిసెంబర్ 6 : రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు, రైతులు విసిగిపోయారని, ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్నే గెలిపిస్తామని చెబుతున్నారని, రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో అభివృద్ధి పరుగులు తీసిందని, కానీ, రెండేళ్లలో పల్లెల అభివృద్ధిని పట్టించుకునేవారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ శనివారం ఆయన మంచుకొండ, పంగిడి, ఈర్లపూడి, రాంక్యాతండా, బద్యాతండా, పరికలబోడుతండా, జింకలతండా పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ చెరువులను పునరుద్ధరించి భూగర్భ జలాలను పెంపొందించారని, ప్రతి పల్లెకు ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి అందమైన పూల మొక్కలను పెంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోని గ్రామాల్లో మనిషి చనిపోతే కర్మకాండలు చేసుకునేందుకు సరైన శ్మశాన వాటికలు లేవని, ఆ సమస్యను గుర్తించిన సీఎం కేసీఆర్ ప్రతి గ్రామంలో అన్ని హంగులతో వైకుంఠధామాలు నిర్మించారన్నారు.
మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చి ప్రతి ఇంటికీ నల్లా ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ప్రతి పల్లెకు రోడ్డు నిర్మాణం జరిగిందనే విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందని, ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని పేర్కొన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని, అందుకు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించి కేసీఆర్‌కు బహుమతిగా ఇవ్వాలని అజయ్ కోరారు.
అత్యధిక సర్పంచ్ స్థానాలను దక్కించుకోవాలి..
రఘునాథపాలెం మండలంలో ఎక్కువ సర్పంచ్ స్థానాలను గెలిపించుకొని బీఆర్ఎస్ పార్టీ తన బలాన్ని నిరూపించుకోవాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవమైన ఐదు పంచాయతీలు బెదిరింపులు, అక్రమాలతో చేసుకున్నవేనని ఆరోపించారు. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాము అలా చేయలేదని, కేసీఆర్ తండాలను గ్రామపంచాయలుగా చేశారని, స్వచ్ఛందంగా ఏకగ్రీవం చేసుకోవాలని పిలుపునిస్తే గిరిజనులంతా ఏకమై అనేక పంచాయతీలను నాడు ఏకగ్రీవం చేసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు.. సీపీఎం, సీపీఐ పార్టీలు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. ఆయా గ్రామాల్లో జరిగిన ఎన్నికల ప్రచారాల్లో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్, నాయకులు మందడపు నర్సింహారావు, మందడపు మాధవరావు, ఆత్మ మాజీ చైర్మన్ భూక్యా లక్ష్మణ్‌నాయక్, తేజావత్ రమేశ్, మాజీ ఎంపీపీ మాలోతు శాంత, తారాచంద్, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, సీపీఐ ఖమ్మం నగర కార్యదర్శి షేక్ జానీమియా, సీపీఎం మండల కార్యదర్శి నవీన్‌రెడ్డి, పగడాల మల్లేశం, నగర కార్పొరేటర్ దండా జ్యోతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.