ఖమ్మం రూరల్, మే 24: ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాండ్లు అధికారంలోకి వచ్చిన తరువాత బౌన్స్ అయ్యాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. చివరికి ‘వరికి బోనస్’ అంటూ చెప్పిన మాటలు బోగస్ అయ్యాయని దుయ్యబట్టారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఖమ్మం రూరల్ మండలం బారుగూడెంలో బీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ ఇన్చార్జి తాళ్లూరి జీవన్‌కుమార్ అధ్యక్షతన శుక్రవారం రాత్రి నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం కోసం అనేక హామీలిచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక వాటిల్లో ఏ ఒక్క హామీనీ అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేసిందని విమర్శించారు. విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు, రైతుల నుంచి నిరుద్యోగుల వరకు ప్రతి ఒక్కరినీ వంచించిందని అన్నారు. పైగా ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని కేసుల పేరుతో భయపెడుతోందని ఆరోపించారు. చివరికి రైతులను కూడా కించపరిచే విధంగా మంత్రులు మాట్లాడుతుండడాన్ని యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అధికారం తలకు ఎక్కిన మాటలు దిగిరావాలంటే ఈ పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ఉప్పల వెంకటరమణ, మరికంటి ధనలక్ష్మి, బెల్లం ఉమ, బెల్లం వేణుగోపాల్, యండపల్లి వరప్రసాద్, ఉన్నం బ్రహ్మయ్య, వేముల వీరయ్య, బాషబోయిన వీరన్న, ఇంటూరి శేఖర్, బొమ్మెర రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.