ఖమ్మం, నవంబర్ 21: మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, గంగుల కమలాకర్ శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం గురువారం రాత్రే వారు ఖమ్మానికి చేరుకున్నారు. మాజీ మంత్రి అజయ్‌కుమార్ ఇంట్లో హరీశ్‌రావు, వద్దిరాజు రవిచంద్ర ఇంట్లో గంగుల కమలాకర్ బసచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పంటలకు గిట్టుబాటు ధరల్లేక వారు అనేక కష్టాలు పడుతున్నారు.
ఈ పరిస్థితుల్లో పత్తి, మిర్చి పంటలకు గిట్టుబాటు ధరలను కల్పించాలనే డిమాండ్‌తో ఖమ్మంలోని వ్యవసాయ మార్కెట్‌ను హరీశ్‌రావు శుక్రవారం ఉదయం 7 గంటలకు సందర్శిస్తారు. రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకుంటారు. ఉదయం 11 గంటలకు ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడతారు. మధ్యాహ్నం 12 గంటలకు చింతకాని మండలం ప్రొద్దుటూరులో ఆత్మహత్య చేసుకున్న రైతు బోజడ్ల ప్రభాకర్ కుటుంబ సభ్యులను, కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమ కేసుతో జైలుకు వెళ్లి వచ్చిన బీఆర్ఎస్ చింతకాని మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్యను పరామర్శిస్తారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. చింతకాని మండలం లచ్చగూడెంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల మృతిచెందిన రైతు గూని ప్రసాద్ కుటుంబ సభ్యులను మధ్యాహ్నం ఒంటిగంటకు పరామర్శిస్తారు.
ఖమ్మం జిల్లా పర్యటన కోసం గురువారం రాత్రి ఖమ్మం వచ్చిన హరీశ్‌రావుకు పువ్వాడ అజయ్‌కుమార్ రాత్రి మమత ఆసుపత్రిలోని తన ఇంటి వద్ద స్వాగతం పలికారు. రాత్రి పువ్వాడ ఇంట్లోనే హరీశ్‌రావు బస చేశారు. హరీశ్‌కు స్వాగతం పలికిన వారిలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్ కర్నాటి కృష్ణ తదితరులు ఉన్నారు. హరీశ్‌రావుతోపాటు ఎర్రోళ్ల శ్రీనివాస్ కూడా వచ్చారు. అలాగే, తన ఇంటికి చేరుకున్న కమలాకర్‌కు ఎంపీ వద్దిరాజు స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరూ కలిసి అజయ్ ఇంటికి వెళ్లి అక్కడున్న అజయ్‌ను, హరీశ్‌రావును కలిసి వచ్చారు.