ఖమ్మం, మే 8: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలే పార్లమెంటు ఎన్నికల్లో ఆ ప్రభుత్వానికి చెంపపెట్టు కావాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విమర్శించారు. గ్యారెంటీ హామీలను అమలుచేయని ఆ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మంలోని 23వ డివిజన్ ముస్తాఫానగర్‌లో శ్రేణులతో బుధవారం ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. నమూనా బ్యాలెట్ చూపిస్తూ, కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ గెలవడం ద్వారా కాంగ్రెస్ మెడలు వంచి గ్యారెంటీ హామీలను అమలుచేయించుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. గడిచిన పదేళ్లలో ఖమ్మం నగరంలో ఏ వేసవిలోనూ తాగునీటి ఇబ్బందులు తలెత్తలేదని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ వచ్చిన కొద్ది కాలంలోనే నగరవాసులు తాగునీటి కోసం తంటాలు పడుతున్నారని అన్నారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అవుతుందని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు హుందాతనంగా లేవని అన్నారు. కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు మక్బూల్, కర్నాటి కృష్ణ, ఇలియాస్, సలీం, జామల్, లాలా, ఝాన్సీ, శ్రీను, తాహేర్, కరీముల్లా, మునాఫ్, అజ్జు, శ్రావణి, విమల తదితరులు పాల్గొన్నారు.