మొక్కల సంరక్షణపై పాలకవర్గాలు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ
ఆదర్శంగా నిలుస్తున్న బోనకల్లు మండలం
బోనకల్లు, జూన్ 25 : ప్రకృతి వనాలు పల్లెలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.. పచ్చందాలను పంచుతున్నాయి.. ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి.. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పాలకవర్గాలు పూల చెట్లు, పండ్ల చెట్లు, ఔషధ మొక్కలను సంరక్షిస్తూ గ్రామాలను పచ్చని వనాలుగా మారుస్తున్నాయి.. బోనకల్లు మండలంలోని 22 పంచాయతీల్లోని వనాలు ఇతర మండలాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.. కలకోట, రావినూతల, గోవిందాపురం-ఎల్, ముష్టికుంట్ల, చిరునోముల, చొప్పకట్లపాలెం, చిన్నబీరవల్లి, జానకీపురం, లక్ష్మీపురం, తూటికుంట్ల వనాలు నందనవనాలుగా మారాయి.
కలకోటలోని వనంలో జామ, నారింజ, సపోట మొక్కలు ప్రస్తుతం ఫలాలను అందిస్తున్నాయి. పూల మొక్కలు రంగు రంగుల పూలతో కనువిందు చేస్తున్నాయి. రావినూతల, కలకోట హైస్కూల్స్, బోనకల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆవరణలో ఏర్పాటైన వనాలపై యాజమాన్యాలు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాయి. మొక్కలను పక్కాగా సంరక్షిస్తున్నాయి.