ఖమ్మం రూరల్, ఏప్రిల్ 13 : ఖమ్మం రూరల్ మండలం తీర్ధాల గ్రామంలో అటవీ శాఖ అధికారులు ఓ ఇంటి నుండి నెమలిని రెస్క్యూ చేశారు. ప్రత్యక్ష సాక్షులు, అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొద్ది రోజుల క్రితం నుండి తీర్థాల గ్రామానికి చెందిన మాలోతు కిషన్ అనే వ్యక్తి ఇంట్లో సుమారు ఏడాది వయసు గల నెమలి ఉన్నట్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో కూసుమంచి అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కె.వి.రామారావు ఆధ్వర్యంలో అటవీ శాఖ బృందం గ్రామాని చేరుకుని కిషన్ ఇంట్లో ఉన్న నెమలిని స్వాధీనం చేసుకున్నారు. నెమలికి ఆరోగ్య పరీక్షల అనంతరం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటే అర్బన్ పార్క్ లో వదిలివేయడం జరుగుతుందని, ఏదేని అనారోగ్య సమస్యలు ఉంటే రెస్క్యూ సెంటర్ కు తరలిస్తామన్నారు. పంట పొలాలలో క్రిమి సంహారక మందులు పిచికారి చేయడం ద్వారా పొలాలకు వచ్చిన నెమలి స్పృహ తప్పి పడిపోవడంతో ఇంటికి తీసుకు వచ్చినట్లు తెలుస్తుందన్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టడం జరుగుతుందన్నారు.