పాల్వంచ, ఫిబ్రవరి 16 : అటవీ అధికారుల చొరవతో ఒక మూగజీవిని కాపాడిన తీరు అందరి ప్రశంశలు అందుకుంటున్నది. భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా పారిశ్రామిక ప్రాంతం పాల్వంచ పట్టణంలోని కేటీపీఎస్ ఏ కాలనీ వాసి రెడ్డిరాజుల వెంకట్ (కేటీపీయస్ ఉద్యోగి) తన క్వార్టర్ ఆవరణలో ఆదివారం చెట్టుపై నుండి ఒక కొండముచ్చు ప్రమాదవశాత్తు క్రింద పడి తీవ్ర గాయాలతో ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతోంది. కాలనీలో తిరిగే కోతులు కొండముచ్చుపై దాడి చేశాయి. గర్భంతో ఉన్న కొండముచ్చు కిందపడి స్పృహ కోల్పోయింది.
అక్కడే ఉన్న బొల్లోరిగూడెం శివాలయం ధర్మకర్త శివలెంక అశ్విని కుమార్, తన మిత్రుడి సహాయంతో ఫారెస్ట్ డివిజనల్ అధికారి దామోదర్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఆయన వెంటనే డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రమాదేవికి, రేంజర్ ఆఫీసర్ సురేష్‌కు, బేస్ క్యాంప్ వాచర్ దూప్ సింగ్ సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సురేష్, దూప్ సింగ్ సంఘటనా స్థలానికి అర్ధ గంటలో హుటాహుటిన చేరుకున్నారు.
పరిస్ధితిని స్వయంగా చూసిన సురేష్, దూప్ సింగ్ తమ సిబ్బంది సహాయంతో ఫారెస్ట్ జీపులో తీవ్ర గాయాలైన కొండముచ్చును తీసుకెళ్లి వెటర్నరీ డాక్టర్‌తో ప్రాధమిక చికిత్స చేయించి సోములగూడెం అర్బన్ పార్క్‌లో సురక్షితంగా విడిచిపెట్టారు. దీంతో అందరూ ఒక మూగ ప్రాణిని కాపాడామనే సంత్రుప్తితో ఊపిరి పీల్చుకున్నారు. సమిష్టి కృషితో ఒక నిండు ప్రాణిని కాపాడిన తీరును, అటవీశాఖ సిబ్బంది చూపిన తెగువను అందరూ ప్రశంసిస్తున్నారు.