చండ్రుగొండ, నవంబర్ 5: పోడు భూముల్లో గిరిజనులు సాగు చేసిన పత్తి పంటను అటవీ శాఖ అధికారులు ధ్వంసం చేశారు. ఈ ఘటన చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రావికంపాడు పంచాయతీ పరిధిలోని పోడు భూముల్లో కొందరు గిరిజనులు పత్తి పంట సాగు చేశారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం దాదాపు వంద మంది అటవీ శాఖ అధికారులు, సిబ్బంది తమ వాహనాల్లో కొడవళ్లు, గొడ్డళ్లు, చేతికత్తులతో గిరిజనులు సాగు చేసిన భూముల వద్దకు చేరుకొని.. గుగులోత్ వాలి, తేజావత్ సరోజ సాగు చేసిన సుమారు ఐదు ఎకరాల పత్తి పంటను ధ్వంసం చేశారు.
దీంతో పంట భూముల వద్దకు బుధవారం ఉదయం చేరుకున్న గిరిజనులు అటవీ శాఖ అధికారులు పీకివేసిన పంటను చూసి బోరున విలపించారు. అటవీ శాఖ అధికారులను తమ పంటను ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ పీకివేసిన మొక్కలతో గ్రామంలోని రహదారిపై నిరసన తెలిపారు. ప్రభుత్వం, అటవీ శాఖ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ హయాంలో తమకు పోడు పట్టాలు వస్తే, ఇప్పటి కాంగ్రెస్ పాలనలో అధికారులు పట్టాలు ఇవ్వకపోగా.. తాము సాగు చేసిన పంటలను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. పంటలు వేసినప్పుడు సాగు చేయొద్దని అటవీ అధికారులు తమకు చెప్పలేదని, చేతికొచ్చిన పంటలను ఇప్పుడు ధ్వంసం చేయడం ఏమిటని ప్రశ్నించారు. పంటలను ధ్వంసం చేసిన అధికారులు, సిబ్బందిపై చర్య తీసుకోవాలని గ్రామస్తులు, గిరిజనులు డిమాండ్ చేశారు.