రామవరం, జూన్ 1: ప్రతి ఆఫీస్, డిపార్ట్మెంట్లలోని ఖాళీ ప్రదేశాల్లో ‘ప్రతి అడుగు పచ్చదనం కోసమే..’ అనే నినాదంతో మొక్కలు నాటాలని సింగరేణి అధికారులను సంస్థ సీఎండీ ఎన్.బలరాం ఆదేశించారు. ఆదివారం కొత్తగూడెం ఏరియా పరిధిలోని జీకేవోసీ యార్డులో ‘వన మహోత్సవం’ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఎండీ మాట్లాడుతూ మొక్కలు నాటడం అంటే దేవుడికి సేవ చేసినట్లే అన్నారు. ప్రతి పౌరుడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ఉందని, అది పెరిగి పెద్దదై రూ.కోట్ల విలువచేసే ఆక్సిజన్‌ను ఇస్తుందని, ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుందన్నారు.
భవిష్యత్తరాల కోసం మొక్కలను నాటాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటివరకు తాను 19వేల మొక్కలను నాటానని, ఈ ఏడాది మరో 2వేల మొక్కలు నాటడంలో భాగంగా ఈరోజు జీకేవోసీలో 200 మొక్కలు నాటినట్లు తెలిపారు. కార్మికప్రాంతాల్లో ఉండే క్వార్టర్లలో పండ్ల మొక్కలను పెంచేవిధంగా వారిని ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీలు, పంచాయతీలు, ప్రజాప్రతినిధులు ఎవరైనా మొక్కలు అడిగితే అందించాలని ఎన్విరాన్మెంటల్ సిబ్బందికి సూచించారు.
కార్యక్రమంలో డైరెక్టర్లు సూర్యనారాయణ, కొప్పుల వెంకటేశ్వర్లు, ఫారెస్ట్రీ అండ్ అడ్వైజర్ మోహన్ చంద్ర పర్జిన్, ఏరియా జీఎం శాలెంరాజు, జీఎం ఎన్విరాన్మెంట్ సైదులు, ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీరమేష్, ఏరియా ఇంజినీర్ సూర్యనారాయణరాజు, ఏరియా అసిస్టెంట్ బ్రాంచి కార్యదర్శి గట్టయ్య, ఏఐఎన్టీయూసీ నుంచి ఎండీ రజాక్, ఏరియా అధికారుల సంఘం అధ్యక్షుడు ఎంవీ నరసింహారావు, ఎస్వోటు జీఎం కోటిరెడ్డి, ఏజీఎం సివిల్ రామకృష్ణ, హనా సుమలత, డీజీఎం శివకేశవరావు, యోహాన్, సత్యనారాయణ, హరినారాయణ తదితరులు పాల్గొన్నారు.