ఖమ్మం, అక్టోబర్ 25: ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఖమ్మం పోలీసు కమిషనరేట్‌లో అందుబాటులోకి వచ్చిందని పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేర న్యాయ వ్యవస్థ నిర్వహణలో విశ్వసనీయమైన శాస్త్రీయ సేవలను అందిస్తూ.. శాస్త్రీయ పరిశోధన రంగంలో స్థిరమైన పురోగతిని సాధిస్తున్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీని ఖమ్మం జిల్లాతోపాటు భద్రాద్రి కొత్తగూడెం, మాహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలకు అందుబాటులో ఉండేవిధంగా ఖమ్మంలోని జూబ్లీపుర ఎస్బీఐ ఎదురుగా ఉన్న ప్రభుత్వ భవనంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇకపై ఈ నాలుగు జిల్లాలకు సంబంధించిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
హత్యలు, లైంగికదాడులు, దోపిడీల కేసుల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణం సంభవించిన మరణ కారణాలను తెలుసుకోవడం నేర దర్యాప్తులో అతి ముఖ్యమైన అంశమని అన్నారు. ఇలాంటి కేసుల్లో వైద్యాధికారి శవాన్ని పరీక్షించి కడుపులోని భాగాలు రక్తం, మెదడు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు తదితర శరీర భాగాలను తీసి గతంలో వరంగల్ జిల్లా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపి వాటిని పరీక్షించేవాళ్లమని అన్నారు. ఇప్పుడు ఖమ్మం ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ విభాగంలో పనిచేసే నిపుణులు శాస్త్రీయ విజ్ఞానంతో పరీక్షిస్తారని తెలిపారు. దీనిని నాలుగు జిల్లాల పోలీస్ అధికారులు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.