పెనుబల్లి (కల్లూరు), ఆగస్టు 17: ఖమ్మం జిల్లా కల్లూరులోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో మరోసారి ఫుడ్ పాయిజన్ జరిగింది. పాఠశాల వసతిగృహంలో శనివారం సాయంత్రం స్నాక్స్ తిన్న, రాత్రి భోజనం చేసిన విద్యార్థినుల్లో పదిమంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని పాఠశాల ప్రిన్సిపాల్ ఆదివారం ఉదయం కల్లూరు వైద్యశాలకు తరలించారు. విద్యార్థినుల తల్లిదండ్రుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా కల్లూరులో గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, వసతిగృహం ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. అందులో 96 మంది విద్యార్థినులున్నారు.
ఈ నెల 4న ఆ పాఠశాలలో ఉదయం అల్పాహారంగా కిచిడీ తిన్న విద్యార్థినులు.. గంట వ్యవధిలోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో పాఠశాల, వసతిగృహ బాధ్యులు వెంటనే సదరు విద్యార్థినులను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన చికిత్స అందించడంతో వారికి ప్రాణాపాయం తప్పింది. అయితే, అదే వసతిగృహంలో మరుసటి రోజైన 5న ఉదయం అల్పాహారంగా ఇడ్లీలు తిన్న విద్యార్థినుల్లో మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని కూడా వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లడంతో వారు కూడా కోలుకున్నారు. ఈ ఘటనలను బాధ్యురాలిని చేస్తూ సదరు వార్డెన్ విజయనిర్మలను గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి విజయలక్ష్మి అదే రోజు సస్పెండ్ చేశారు.
తాజాగా మరో పది మంది..
ఈ రెండు ఘటనలు జరిగి 13 రోజులు గడవకముందే తాజాగా శనివారం సాయంత్రం కూడా మరో 10 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. శనివారం సాయంత్రం స్నాక్స్‌లో భాగంగా విద్యార్థినులు పకోడీ తిన్నారు. అన్నం, ఆలుగడ్డ కూర, పప్పు కలిపి రాత్రి భోజనంగా తిన్నారు. ఆ తరువాత కొద్దిసేపటికే పది విద్యార్థినులు తీవ్రమైన కడుపునొప్పితో, గ్యాస్ నొప్పితో బాధపడ్డారు. దీంతో వసతిగృహ సిబ్బంది ఆదివారం ఉదయమే సదరు విద్యార్థినులను కల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ నవ్యకాంత్ మాట్లాడుతూ.. విద్యార్థినులకు ఎలాంటి ప్రాణప్రాయమూ లేదని తెలిపారు. కాగా, విషయం తెలుసుకున్న తహసీల్దార్ సాంబశివుడు వెంటనే ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. ఆసుపత్రికి వెళ్లి విద్యార్థినులను పరామర్శించారు. వారి ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. అయితే, సదరు పాఠశాలలోని విద్యార్థినులు వరుసగా అస్వస్థతకు గురవుతున్న విషయంపై విద్యార్థినుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, విషయం తెలుసుకున్న వెంటనే అస్వస్థతకు గురైన విద్యార్థినుల తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు.