తిరుమలాయపాలెం, మే 31 : పాలేరు నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తానని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కొక్కెరేణి, ఎర్రగడ్డ, తాళ్లచెరువు, బీరోలు, బచ్చోడు, బచ్చోడుతండా, జూపెడ, కాకరవాయి, సోలీపురం గ్రామాల్లో శుక్రవారం విస్తృతంగా పర్యటించిన ఆయన ఆయా గ్రామాల్లో జరిగిన సమావేశాల్లో మాట్లాడారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే నియోజకవర్గ ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, మూడేళ్లలో అర్హులందరికి ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. దరఖాస్తు చేసుకున్న అర్హులకు రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు. పాలేరు నియోజకవర్గంలో తాగు, సాగునీటి కల్పనకు పెద్దపీట వేస్తామని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమయ్యే పరిస్థితులు ఉన్నందున, నాగార్జున సాగర్‌లో నీళ్లు ఉన్నా.. లేకున్నా పాలేరు రిజర్వాయర్‌ను నింపేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం సర్వే చేయడానికి ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. నియోజకవర్గంలో వ్యవసాయాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ బోడ మంగీలాల్, జడ్పీటీసీ బెల్లం శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ బుద్ద వంశీకృష్ణ, కాంగ్రెస్ నాయకులు చావా శివరామకృష్ణ, రామసహాయం నరేశ్‌రెడ్డి, కొప్పుల అశోక్ తదితరులు పాల్గొన్నారు.