భద్రాచలం, సెప్టెంబర్ 30: గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది గోదావరి వరద భద్రాద్రి ఏజెన్సీ వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆ వరదంతా గోదావరిలోకి వచ్చి చేరుతోంది. దీంతో భద్రాచలం వద్ద ప్రవాహం పెరుగుతోంది. నెల రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరిక అయిన 43 అడులు దాటిన గోదావరి.. మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటలకు రెండో ప్రమాద హెచ్చరిక అయిన 48 అడుగులు దాటింది. సాయంత్రం 5 గంటలకు 50 అడుగులకు వరద ప్రవాహం చేరింది.
మళ్లీ రాత్రి 10 గంటలకు 49.70 అడుగులకు తగ్గింది. గోదావరి ప్రతి గంటకూ 10 నుంచి 20 పాయింట్లు పెరుగుతూ నెమ్మదిగా ప్రవహిస్తుండడంతో భద్రాచలం నియోజకవర్గంలోని వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాల్లోని నదీ పరీవాహక ప్రాంతాల్లో వ్యవసాయ భూములు అధిక శాతం వరదనీటి ముంపులోనే ఉంటున్నాయి. అలాగే, వాజేడు నుంచి ఛత్తీస్గఢ్ వెళ్లే జాతీయ రహదారి ఇప్పటికీ వరద నీటిలోనే ఉంది.
వెంకటాపురం మండలం ఎదిర వద్ద, దుమ్ముగూడెం మండలం తూరుబాక వద్ద, భద్రాచలం వద్ద (ఏపీలోని నెల్లిపాక, చోడవరం, మురుమూరు గ్రామాల వద్ద) రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. నెల్లిపాక వద్ద రహదారిపైకి వరద నీరు రావడంతో ఛత్తీస్గఢ్ వైపు వెళ్లే వాహనాలన్నీ గుండాల, భద్రాచలం శివారులోనే నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలం బైరాగులపాడు, సున్నంబట్టి గ్రామాలను పూర్తిగా గోదావరి వరద చుట్టుముట్టింది. దీంతో అధికారులు పడవలపై వెళ్లి ముంపు ప్రాంతాల ప్రజలతో మాట్లాడుతూ వారికి నిత్యావసర సరుకులు అందిస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
భద్రాచలం వద్ద గోదావరి వరద రెండో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్నందున అధికారులు, ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. వరద పరిస్థితిని కలెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. భద్రాచలం సబ్ కలెక్టరేట్, ఐటీడీఏ, కలెక్టరేట్లలో కంట్రోల్ రూములను ఏర్పాటు చేశారు.
భక్తులెవరూ గోదావరి స్నానాలకు రావొద్దు: సబ్ కలెక్టర్ మృణాల్
భద్రాచలంలోని గోదావరి స్నానఘట్టాల వద్దకు భక్తులెవరూ పుణ్య స్నానాల కోసం రావద్దని, కరకట్టపై ప్రజలెవరూ సెల్ఫీలు, వీడియోల కోసం రావద్దని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట ఆదేశించారు. గోదావరి ప్రవాహం 50 అడుగులు దాటిన ప్రవహిస్తున్నందున మంగళవారం సాయంత్రం కరకట్ట పరిసరాలను ఆయన పరిశీలించారు. అధికారులకు తగిన సూచనలు చేశారు.
హెడ్ లాకుల వద్ద 25 అడుగులకు..
దుమ్ముగూడెం, సెప్టెంబర్ 30: దుమ్ముగూడెం హెడ్ లాకుల వద్ద మంగళవారం సాయంత్రం గోదావరి 25 అడుగులకు చేరుకుంది. తూరుబాక డైవర్షన్ రోడ్డు వద్దకు భారీగా వరద చేరడంతో ఇటు భద్రాచలం, అటు చర్ల వెళ్లే వాహనాలను అధికారులు నిలిపివేశారు. దీంతో భద్రాచలం వైపు వెళ్లాల్సిన వాహనాలు ములకపాడు నుంచి రాకపోకలు సాగుతున్నాయి. చర్ల నుంచి ఇసుక లారీలు అధిక సంఖ్యలో రావడంతో పోలీసులు దుమ్ముగూడెం క్రాస్ రోడ్డు నుంచి లక్ష్మీనగరం వరకు లారీలను నిలిపివేశారు. బైకులు, ఆటోల్లో ప్రయాణించే వారు ఇబ్బందులు పడుతున్నారు.
నీటమునిగిన నారచీరల ప్రాంతం..
పర్ణశాల, సెప్టెంబర్ 30: దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల పుణ్యక్షేత్రం వద్ద గోదావరి పెరిగి ఉధృతంగా ప్రవహిస్తోంది. సున్నంబట్టి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై గోదావరి నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పర్ణశాల పుణ్యక్షేత్రం వద్ద చారిత్రాక నారచీరల ప్రాంతం కొద్ది రోజులుగా పూర్తిగా నీటిలోనే మునిగి ఉంది.
పంటలకు తీరని నష్టమంటున్న రైతులు
గోదావరి వరదల కారణంగా చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ఈ ఏడాది ఇప్పటికే రెండు పంటలు మునిగాయని; దీంతో పత్తి, మిర్చి, వరి పంటలకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ముంపు ప్రాంతాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్లో ఎక్కువ రోజులు గోదావరి 40 అడుగులకు పైనే ప్రవహిస్తూ ఉండడంతో పరీవాహకంలోని మునిగి దెబ్బతింటున్నాయని అంటున్నారు. తూరుబాక, నర్సాపురం, సీతారామపురం గ్రామాల్లోని గోదావరి పరిసరాల్లో పంటలు వేసిన రైతుల్లో ఆందోళన మొదలైంది.