భద్రాద్రి కొత్తగూడెం, జూలై 18 (నమస్తే తెలంగాణ)/అశ్వారావుపేట రూరల్/అశ్వారావుపేట టౌన్ : భద్రాద్రి జిల్లాలో బుధవారం రాత్రి ముసురుతో ప్రారంభమైన వర్షం గురువారం నాటికి అతలాకుతలం చేసింది. ఏకధాటిగా వర్షం కురవడంతో వాగులు పొంగిపొర్లాయి. ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరడంతో నిండుకుండను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం.. భారీ చెట్లు రోడ్లపై విరిగిపడడం.. వరద నీరు రహదారులపై ప్రవహించడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందిపడ్డారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోని పెదవాగులోకి భారీగా వరద నీరు చేరడంతో మూడు గేట్లు ఎత్తి 22,330 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
ఎగువ నుంచి ఎక్కువగా వరద నీరు ప్రవహించడం వల్ల ప్రాజెక్టులోని నీరు ఎగపోటుతోపాటు పలు వాగులు, వంకలు పొంగడంతో అశ్వారారావుపేట మండలం నారాయణపురం, బచ్చువారిగూడెం, అనంతారం, ఖమ్మంపాడు, మేకలబండ, రంగాపురం, కొత్తూరు గ్రామాల వైపు నీరు చుట్టుముట్టింది. దీంతో ఆయా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అశ్వారావుపేట, వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెదవాగు వరద ఉధృతి ఎక్కువ కావడంతో వాగుకు రెండుచోట్ల గండి పడింది. దీంతో గుమ్మడవల్లి, కొత్తూరు గ్రామాలు నీట మునిగే ప్రమాదమున్న నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ఆయా గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
పెదవాగు వరద నీటిలో 25 మంది ప్రయాణికులు, కూలీలు చిక్కుకొని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడకు చేరుకోవడంతోపాటు హెలీకాప్టర్ సహాయంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బచ్చువారిగూడెంలో పశువుల కాపరులు చెట్టుపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకునేందుకు నానా తంటాలు పడ్డారు. వారిని హెలికాప్టర్ ద్వారా రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో బోటు సహాయంతో నారాయణపురం ప్రాంతానికి తరలించారు. అశ్వారావుపేట నుంచి భద్రాచలం వెళ్లే రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంకమ్మ చెరువు కింద పంట పొలాలు వరద నీటిలో తేలియాడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు నుంచి వేలేరుపాడుకు కారులో వెళ్తున్న ఐదుగురు ప్రయాణికులు వరదలో చిక్కుకున్నారు. దీంతో కారును వదిలేసి చెట్లను పట్టుకోవడంతోపాటు హాహాకారాలు చేయడంతో అల్లూరిసీతారామనగర్ వద్ద గ్రామస్తులు వారిని రక్షించారు. వరద ఉధృతికి వారి కారు నీటిలో కొట్టుకుపోయింది. భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ఉన్నతాధికారులతో మాట్లాడి రక్షణ చర్యలు చేపట్టారు.
రెండు రోజులుగా జిల్లావ్యాప్తంగా వర్షాలు కురవడంతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కిన్నెరసానిలో 402 అండుగుల మేర వరద నీరు వచ్చి చేరింది. తాలిపేరులో వరద నీరు చేరడంతో తాలిపేరు పొంగి ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద 22 అడుగుల వరకు వరద నీరు చేరింది. రాత్రి 7 గంటలకు 18.2 అడుగులతో నిలకడగా ఉంది.
భద్రాచలం నుంచి చర్ల వైపు వెళ్లే రహదారిపైకి వరద నీరు రావడంతో అక్కడ సహాక చర్యలు చేపట్టారు. అత్యధికంగా అశ్వారావుపేటలో 109 మి.మీ, దమ్మపేట మండలంలో 80 మి.మీ, అన్నపురెడ్డిపల్లిలో 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పాల్వంచ, సుజాతనగర్, భద్రాచలం, దుమ్ముగూడెం మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.అయితే రుణమాఫీ సంబురాల్లో అధికారులు ఉంటే.. వర్షాలకు గిరిజన ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నా పట్టించుకునేవారు లేరనే వాదనలు వినిపిస్తున్నాయి.