ఇటీవల మున్నేరు పొంగిన కారణంగా ఖమ్మంలో వేలాదిమంది నిరాశ్రుయులయ్యారు. కేవలం కట్టుబట్టలతో బయటికెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. ఆ వరద బాధితులంతా నేటికీ కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వారిని ఆదుకునే అంశంలో ‘ఆరాటం ఆరుబాళ్లు – పని మూడుబాళ్లు’ అనే సామెతలా ప్రభుత్వ పనితీరు ఉంది. స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డే వరద ప్రాంతాల్లో పర్యటించినప్పటికీ బాధితులకు ఆశించిన మేర ప్రయోజనం కలగలేదు. పరిహారం అందలేదు.
ఖమ్మం, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మున్నేరు వరదల కారణంగా ఖమ్మంలోని వెంకటేశ్వరనగర్, బొక్కలగడ్డ, సారథినగర్, మంచికంటినగర్, మోతీనగర్, పంపింగ్‌వెల్ రోడ్, ధంసలాపురం వంటి కాలనీల్లో తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. రాత్రికి రాత్రే వరదనీరు ఇళ్లలోకి చేరడంతో ఇంట్లో ఏ వస్తువునూ బయటకు తీసుకుపోలేని పరిస్థితి. అయితే వరద బాధిత కుటుంబాలను గుర్తించేందుకు ప్రభుత్వం కంటితుడుపు చర్యలు తీసుకున్నప్పటికీ ఏమాత్రమూ ప్రయోజనం కలగలేదు. ఇతర మండలాల నుంచి ప్రత్యేకంగా సిబ్బందిని రప్పించి వారం పది రోజులపాటు సర్వే చేసినప్పటికీ అసలైన వరద బాధితుల వివరాలను సర్వేలో పొందుపరచలేదనే విమర్శలు బలంగా విన్పిస్తున్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. దాదాపు వారం రోజుల పాటు సర్వే చేసిన యంత్రాంగం.. చివరికి బాధితుల జాబితాను ప్రభుత్వానికి అందజేసింది. అయితే, ఈ సర్వేలో అనేక కొర్రీలు, పొరపచ్చాలు ఏర్పడడంతో బాధిత కుటుంబాలు సర్కారు సాయానికి దూరమయ్యాయి. ఇప్పటికే కొందరి అకౌంట్లలో ఒక్కో కుటుంబానికి రూ.16,500 చొప్పున జమ అయినప్పటికీ అసలైన బాధితుల్లో సగానికి సగం మందికి పరిహారం అందలేదు. దీంతో ఇళ్లు పూర్తిగా నిండి తీవ్రంగా నష్టపోయిన వారిలో చాలామందికి పరిహారం అందలేదు.
జాబితాలో పేరున్న వరద బాధితుల్లో చాలామందికి పరిహారం అందలేదు. తమకు అర్హత ఉన్నప్పటికీ పరిహారం ఎందుకు జమకాలేదంటూ పలువురు బాధితులు అధికారుల వద్ద మొరపెట్టుకుంటే.. ‘తక్కువ ప్రభావం ఉన్నందున పరిహారం రాదు’ అంటూ సమాధానమిస్తున్నారు. అయితే, వరదలు తగ్గిన తరువాత క్షేత్రస్థాయి సర్వే కోసం వచ్చిన సిబ్బంది ఆదరాబాదరాగా ఇంటింటి పరిశీలన చేశారని బాధితులు చెబుతున్నారు. సర్వేకు వచ్చిన అధికారులు కనీసం తమ ఇంట్లోకి రాలేదని, లోపలికి వచ్చి ఎంత నష్టం జరిగిందో చూడలేదని, ఏయే వస్తువులు తడిచాయో అడగలేదని, ఏయే సామగ్రి వరదలో కొట్టుకెళ్లిందరో నమోదు చేసుకోలేదని వాపోతున్నారు. కేవలం ఇంటిని ఫొటో తీసుకొని తమ పని ముగించుకొని వెళ్లారని ఆరోపిస్తున్నారు. అసలైన బాధితుల్లో చాలామందిని కేటగిరీ-1, 2లలో చేర్చరాని, కేవలం కేటగిరీ-3లో పేరున్న బాధితులనే పరిహారానికి అర్హులుగా గుర్తించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో జాబితాలో తమ పేర్లు ఉన్నప్పటికీ కేటరిగీ-3లో తమ పేర్లన పొందుపర్చని కారణంగా తాము ప్రభుత్వ సాయానికి దూరమయ్యామని దుయ్యబడుతున్నారు. అయితే బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు మరోసారి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే రెండో విడతలో దరఖాస్తులు అందజేసే బాధితులకు సర్కారు సాయం అందుతుందా? లేదా? అనేది వేచి చూడాలి.
మేన్నేరుకు భారీగా వరద రావడంతో మా ఇల్లు పూర్తిగా మునిగిపోయింది. వాగు పక్కనే మా ఇల్లు ఉంది. రాత్రివేళ మొట్టమొదట మా ఇంట్లోకి వరదనీరు ప్రవేశించింది. దాదాపు ఐదు రోజుల పాటు ప్రభుత్వ పునరావాస కేంద్రంలోనే ఉన్నాం. మేం అక్కడ ఉన్న సమయంలోనే సర్వే సిబ్బందికి మా ఇంటికి వచ్చారట. అప్పడు మేం లేకపోవడంతో ఆ తరువాత మేమే స్వయంగా మున్పిపాలిటి కార్యాలయానికి వెళ్లి మరోసారి దరఖాస్తు చేశాం. ఆ తరువాత అధికారులు మరోసారి వచ్చి సర్వే చేశారు. కానీ ఇంతవరకు నా ఖాతాలో పరిహారం జమకాలేదు.
సర్వే జాబితాలో మా పేరు ఉంది. కానీ ఇప్పటి వరకు సర్కారు పరిహారం మాకు అందలేదు. ప్రతిరోజూ నయాబజార్, మున్సిపాలిటీల్లోని వరద బాధితుల సర్వే కౌంటర్ల వద్దకు వెళ్తున్నాను. ఎవరిని అడిగినా ఓపిక పట్టాలని అంటున్నారు. కానీ ఇన్ని రోజులైనా పరిహారం జమ కావడం లేదు. చాలామంది తెలివిగా వారి బంధువుల పేర్లు, తెలిసిన వారి పేర్లు రాయించుకున్నారు. వారికి మాత్రం ముందుగానే సాయం అందింది. నిండా మునిగిన మాకు మాత్రం ప్రభుత్వం నుంచి రూపాయి కూడా రాలేదు. మా ఇల్లు మునిగి రూ.3 లక్షల వరకూ నష్టం జరిగింది. కానీ ఆదుకునే దిక్కులేదు.
మున్నేరు వరదలు భారీగా రావడంతో మా ఇంటిలోపల ఉన్న అన్ని వస్తువులూ బురదమయమయ్యాయి. ఏ ఒక్క వస్తువూ పనికొచ్చేలా లేదు. ఇల్లు మునిగిపోయిందని చెప్పి రెండుసార్లు మున్సిపాలిటీకి వెళ్లి మొరపెట్టుకున్నాను. అధికారులు సర్వే కోసం వచ్చారు. కొద్దిరోజుల తరువాత అధికారులు పిలిచారు. ఖాతా నంబరు పొరపాటుగా ఉందని, మరోచెప్పాలని అడిగారు. ఇంకోసారి చెబితే రాసుకున్నారు. కానీ ఇంతవరకు పరిహారం జమ కాలేదు. మాతోపాటు ఇళ్లు మునిగిన వారికి జమ అయ్యాయి. మాకు మాత్రం రాలేదు.