ఖమ్మం, సెప్టెంబర్ 9 : ఖమ్మం జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. జిల్లావ్యాప్తంగా గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనం విలవిలలాడుతున్నారు. వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం నగరంలోని మున్నేరుప్రాంత ప్రజల బతుకులు వరదల వల్ల అతలాకుతలమయ్యాయి. ఇక రైతుల పరిస్థితి వర్ణణాతీతం. చేలల్లో, మెట్ట భూముల్లో ఇసుక మేటలు వేయగా, పొలాల్లో నీటి నిల్వలు పేరుకపోయి రైతులు లబోదిబోమంటున్నారు.
ఇండ్లు కూలిన పేదలు అల్లాడుతున్నారు. జిల్లాలో అనేక చెరువులు పొంగిపొర్లుతున్నవి.. చెరువుల కట్టలు తెగే అవకాశం ఉందని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు మొత్తం దెబ్బతిన్నవి. పలు కల్వర్టులు ప్రమాదకరంగా మారాయి. అధికార యంత్రాంగం మొత్తం ఖమ్మం మున్నేరు పరీవాహక ప్రాంతంపైనే దృష్టి సారించడంతో జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో పునరావాస చర్యలు చేపట్టడం లేదు.. వ్యవసాయశాఖ అధికారులు పంటనష్టం అంచనా వేయడం లేదు… మున్నేరు పరీవాహక ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు మరో రెండు రెండురోజులపాటు కొనసాగనున్నాయి..
మున్నేరుకు ఆదివారం సాయంత్రం వరద పెరగకపోవడం వల్ల అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. పరీవాహక ప్రాంతాల్లోని పలువురు ప్రజలు గంటగంటకు మున్నేరు నది ప్రవాహాన్ని తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. రెండురోజులుగా మోస్తరు వర్షం మాత్రమే కురవడంతో మున్నేరు పరీవాహక ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నవి. రోడ్ల క్లీనింగ్, శానిటేషన్, సర్వే పనులు, విద్యుత్ పునరుద్ధరణ లాంటి పనులు శరవేగంగా జరుగుతున్నవి..
పదిరోజులుగా జిల్లావ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లా ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పత్తి, మొక్కజొన్న, వరి, మిర్చితోటలు, కంది, ఉద్యాన పంటలు కూరగాయలు, ఆకుకూరలు అక్కడఅక్కడ బొప్పాయి తోటలు, పండ్ల తోటలు దెబ్బతిన్నాయి.. వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా మేరకు జిల్లావ్యాప్తంగా 60 వేల ఎకరాల్లో పలురకాల పంటలు దెబ్బతిన్నట్లు నివేదికలు ఇచ్చారు. ఐతే పూర్తిస్థాయిలో అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే తప్పుడు లెక్కలు చెబుతున్నట్లు పలువురు రైతుసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదిలాఉండగా మూడ్రోజుల నుంచి కురుస్తున్న వర్షం జిల్లా ప్రజలను భయపెడుతున్నది.. ఇప్పటికే పలు చెరువులు, రిజర్వాయర్లు నిండుకుండలా ఉండడం, మున్నేరుకు ఎప్పుడు వరద వస్తుందోననే ఆందోళనలో ప్రజలు భయంతో గడుపుతున్నారు.
మున్నేరు ముంపు ప్రాంతాల్లోని వెంకటేశ్వరనగర్, పద్మావతినగర్, బొక్కలగడ్డ, ధంసలాపురం, దానవాయిగూడెం కాలనీల్లోని ముంపు ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరుకులు తమ ఇండ్లకు చేరలేదని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయా డివిజన్ నాయకులు వారి పార్టీకి చెందిన వారికే ఇస్తున్నారు కానీ.. ప్రతి ఇంటికి వచ్చి అధికారులు, మున్సిపల్ సిబ్బంది వచ్చి ఇవ్వడం లేదని పేర్కొంటున్నారు.
స్వచ్ఛంద సంస్థలు, పలు సంఘాలు, సంస్థలకు చెందిన వ్యక్తులు వచ్చి భోజనం, దుప్పట్లు అందిస్తున్నారని ప్రభుత్వపరంగా ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదని పేర్కొంటున్నారు. గ్యాస్‌పొయ్యిలు పదిరోజులైనా వెలగట్లేదు.. నిత్యావసర సరుకులు ఇస్తున్నారు కాని వాటిని వండుకోవడానికి గిన్నెలు కూడా లేవని మరికొంతమంది పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే సహాయం చేయాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వం ఇస్తానన్న పదివేలు కూడా ఇవ్వలేదు.. బ్యాంక్ ఖాతాల నెంబర్లు సేకరించారు కాని వాటిలో డబ్బులు జమకాలేదు.. దీంతో బాధితులు ఇబ్బందుల్లోనే కొట్టుమిట్టాడుతున్నారు.
మున్నేరు వరదల కారణంగా పరీవాహక ప్రాంతాల్లో అనేక ఇండ్లు దెబ్బతిన్నాయి. స్థానికుల అంచనా మేరకు దాదాపు వందకు పైగానే ఇండ్లు దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. కానీ ఈ విషయంలో అధికారులు మాత్రం ఇంతవరకు ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. ఇండ్లు కూలిన వారికి రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇస్తామని జిల్లాకు చెందిన మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో పర్యటిస్తూ చెబుతున్నప్పటికీ ఇంతవరకు అతీలేదు గతీలేదు. పూర్తిగా నిరాశ్రయులైన పేదలు లబోదిబోమంటున్నారు. జిల్లాలోని ఖమ్మం, పాలేరు, మధిర నియోజకవర్గాల్లో అనేక ప్రాంతాల్లో ఇండ్లు కూలాయి. ఖమ్మంరూరల్ మండలంలోని రాజీవ్‌గృహకల్ప, కస్నాతండా తదితర చోట్ల ఇండ్లు దెబ్బతిన్న బాధితులు పొంగులేటిని కలిసి విన్నవించినా ఎలాంటి ఫలితం లేదు.
మున్నేరు వాగు పరీవాహక ప్రాంతాల్లో అత్యధికంగా నిరుపేదలే జీవిస్తున్నారు. కూరగాయల మార్కెట్, వ్యవసాయశాఖ మార్కెట్లో హమాలీలుగా, గాంధీచౌక్ ప్రాంతంలోని కిరాణా దుకాణాల్లో కూలీలు, సుతార్లు, రాడ్‌బెండింగ్, ప్లంబింగ్ పనులు చేసేవారు, మార్బుల్ పనిచేసే కూలీలు, తోపుడు బండ్లపైన పండ్లు, కూరగాయలు, మొక్కజొన్న కంకులు, బజ్జీలు అమ్ముతూ జీవించే వారు అత్యధికంగా ఉన్నారు. వీరందరికి గత పదిరోజులుగా పనులు లేకపోవడం, ఇండ్లన్నీ బురదగా మారడం, ఇంట్లో సామన్లు మొత్తం వరదలో కొట్టుకపోవడం వల్ల వారి జీవితాలు చిన్నాభిన్నంగా మారాయి.
ఇల్లు అంతా మునిగి లక్షల రూపాయాలు నష్టపోయాం.. ఇంతవరకు ప్రభుత్వం ఆదుకోలేదు.. ఏదో మా మొఖాన నాలుగు సరుకులు ఇచ్చి మా చావుకు మమ్మల్ని వదిలేశారు.. ప్రభుత్వానికి బాధ్యత లేదా? సీఎం రేవంత్‌రెడ్డి వచ్చిండు, పోయిండు. పది వేలు ఇస్తామన్నారు.. ఇంతవరకు అతీలేదు.. గతీలేదు. ఎవరూ పట్టించుకోరు. ఓట్లప్పుడు వచ్చి అదిచేస్తాం.. ఇది చేస్తాం అంటారు.. కానీ ఇబ్బందుల్లో ఉంటే మాత్రం ఎవరూ రారు.
– ఆకునూరి సునీత, మోతీనగర్, ఖమ్మం నగరం
మునిగిన ప్రతి ఇంటికి పదివేలు ఇస్తానని చెప్పారు. ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదు. బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకున్నరు ఇంకా డబ్బులు రాలేదు. ఏదో నాలుగు సరుకులు మాత్రం ఇస్తున్నారు. వాటితో ఎలా బతుకుతాం.. ప్రభుత్వానికి బాధ్యత లేదా.. మాటలు మాత్రం చాలా గొప్పగా చెబుతారుగా.. సాయం ఎందుకు చేయరు.. మా సొమ్ము మాకు ఇవ్వడానికి ఇబ్బందులు ఎందుకు?
– మహమూద్, కాల్వొడ్డు, ఖమ్మం నగరం
రేవంత్‌రెడ్డి పదివేలు ఇస్తానని అన్నాడు.. అవి దేనికి సరిపోతాయి.. ఇంట్లో వస్తువులు అన్ని పాడైపోయాయి.. కష్టపడి ఏడాదికొకటి కొనుక్కున్నాం.. వాల్లు ఇచ్చే పదివేలు దేనికి సరిపోతాయి.. క్వింటాళ్ల కొద్దీ బొయ్యం తడిసిపోయాయి. పదిరోజులైనా గ్యాస్ ముట్టించలేదు. ఆకలితో అలమటిస్తున్నాం.. తిండి పెట్టేవాడు లేడు నీళ్లు ఇచ్చేవాడు లేడు.. చీకటిలో మగ్గుతున్నాం.
– ఉమ్మనేని ఈశ్వరమ్మ, బొక్కలగడ్డ, ఖమ్మం నగరం
ప్రాణాలు తప్ప మాకు మిగిలేదేమీ లేదు.. మాకు దిక్కెవరయ్యా.. పదిరోజులైనా ఇంట్లో అన్నం లేదు.. తాగడానికి నీరు రావట్లేదు.. వరద వస్తుందని ముందే చెప్పినా మా వస్తువులు మేము కాపాడుకొనేవాళ్లం.. కానీ ఏ ఒక్కరు కూడా చెప్పలేదు.. ప్రాణాలు పోతాయేమోనని భయపడ్డాం. కానీ దేవుడి దయ వల్ల ప్రాణాలు మాత్రం పోలేదు.. ఆస్తులు పోయాయి.
– మేడబోయిన ఉషారాణి, వెంకటేశ్వరనగర్, ఖమ్మం నగరం
ప్రభుత్వం ఉంది ప్రజల కోసమే కదా.. మీము ఓట్లు వేస్తే గద్దెమీద కూర్చున్నారు. మాకు కష్టం వస్తే మాత్రం ఎవరూ ఆదుకోరా.. రూపాయి కూడా సాయం చేయలేదు. పోయిన ఏడాది ఇదేవిధంగా వరదలు వస్తే మాకు ఎలాంటి నష్టం జరగలేదు. వస్తువులకు ఏమి కాలేదు.. రాత్రికి రాత్రే రాజమండ్రి నుంచి బోటింగ్ వాళ్లను రప్పించి మాకు రక్షణగా నిలిచారు.
– ధరావత్ జ్యోతి, కాల్వొడ్డు, ఖమ్మం నగరం