ఖమ్మం, జూలై 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వరద గోదావరి శాంతించింది. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నెమ్మదించింది. భద్రాచలం వద్ద గురువారం సాయంత్రం 44.60 అడుగులకు చేరుకున్న నీటిమట్టం శుక్రవారం రాత్రి 10 గంటల వరకు 40.6 అడుగులకు తగ్గింది. జిల్లా యంత్రాంగం ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. పారిశుధ్య చర్యలు ముమ్మరం చేసింది. భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆలతో కలిసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ప్రత్యేకాధికారులు వరద ఉధృతిని పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పునరావాస కేంద్రాలకు తరలిన ముంపు బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అధైర్యపడొద్దని వారికి భరోసానిచ్చారు.
ఎగువన కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నం ప్రవాహం 43 అడుగులకు చేరుకోగా భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు 41.10 అడుగులకు ప్రవాహం చేరుకున్నది. మళ్లీ ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆదేశాల మేరకు అధికారులు భద్రాచలం నియోజకవర్గావ్యాప్తంగా 110 ముంపు గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాల ప్రజలను 70 పునరాస కేంద్రాలకు తరలించింది. భద్రాచలం పట్టణంలోని సీతారామచంద్రస్వామి ఆలయ పరిసరాల్లో నిలిచిన వరద నీటిని సీతారామ ప్రాజెక్టు పనులకు వినియోగించిన బాహుబలి విద్యుత్ మోటార్ల ద్వారా మళ్లించారు. మంత్రి అజయ్‌కుమార్, భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ప్రత్యేకాధికారులు అనుదీప్, గౌతమ్ పోట్రు, కృష్ణ ఆదిత్య పట్టణంలో పర్యటించారు. ముంపు ప్రాంతాల్లో పారిశుధ్య చర్యలను పర్యవేక్షించారు. పునరావాస కేంద్రాలకు వెళ్లి బాధితులతో మాట్లాడారు. కేంద్రాల్లో అన్ని వసతులు ఉంటాయని, ప్రజలెవరూ అధైర్యపడొద్దని భరోసానిచ్చారు.
మోస్తరు వర్షం..
ఖమ్మం వ్యవసాయం, జూలై 21/చర్ల: మూడురోజులు వరుసగా కురుస్తున్న వాన శుక్రవారానికి బ్రేక్ ఇచ్చింది. ఖమ్మం జిల్లావ్యాప్తంగా అక్కడక్కడా చిరుజల్లుల నుంచి మోస్తరు వాన తప్ప పెద్దగా తీవ్రత లేదు. గడిచిన 24 గంటల్లో (గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు) జిల్లావ్యాప్తంగా సరాసరి 30.8 మి.మీ వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా కామేపల్లి మండలంలో 84.6 మి.మీ నమోదైంది. వర్షం తగ్గుముఖం పట్టడంతో వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు పొలంబాట పట్టారు. క్షేత్రస్థాయిలో పర్యటించి సాగుపై రైతులకు సూచనలు సలహాలు ఇచ్చారు. పత్తి, అపరాల సాగులో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలపై దిశానిర్దేశం చేశారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా వరి నాట్లు ఊపందుకున్నాయి. భద్రాద్రి జిల్లాలో వర్షం తెరిపిచ్చింది. గురువారం కురిసిన వర్షానికి చర్ల మండల పరిధిలోని తాలిపేరులోకి శుక్రవారం భారీగా వరద నీరు చేరడంతో ప్రాజెక్ట్ అధికారులు మొత్తం 24 గేట్లలో 21 గేట్లను ఎత్తి 62 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.