ఉమ్మడి జిల్లాలో మృత్యువు దూసుకొచ్చింది. ఐదుగురిని బలిగొంది. పాల్వంచలో యూ-టర్న్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు రైతులు, ఖమ్మంలో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో స్కూటీ నడుపుతున్న మహిళ, ఖమ్మం రూరల్ మండలంలో విద్యుదాఘాతంతో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్, పాల్వంచ మండలంలో బైక్ ఢీకొనడంతో యువకుడు ప్రాణాలు కోల్పోయారు. అన్నం కోసం అన్నదాతలు..
పాల్వంచ, జూలై 16: అన్నం కోసం హోటల్‌కు వెళ్లేందుకని ఇద్దరు రైతులు బైక్‌పై యూ-టర్న్ చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో వెనుకగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఆ ఇద్దరు రైతులు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. పాల్వంచ పోలీసులు తెలిపిన వివరాలు.. లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం గ్రామ రైతులు ఈసం జనార్దన్(46), తేజావత్ దుదియా(52) కలిసి వ్యవసాయ పనిముట్లు కొనేందుకు బైక్‌పై పాల్వంచకు గురువారం వచ్చారు. తిరుగు ప్రయాణమయ్యేసరికి మధ్యాహ్నమైంది. భోజనం చేసేందుకని, రోడ్డు అవతల ఉన్న హోటల్ వద్దకు వెళ్లేందుకు నవభారత్ వద్ద యూ-టర్న్ తిరిగారు.
సరిగ్గా అదే సమయంలో, గుంటూరు నుంచి భద్రాచలానికి వేగంగా వెళ్తున్న ఆర్టీసీ (భద్రాచలం డిపో-టీఎస్ 2428 జెడ్ 0047) బస్సు.. ఆ ఇద్దరు రైతుల బైక్‌ను ఢీకొంది. అదే వేగంతో ఆ బైక్‌ను 20 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో జనార్దన్, దుదియా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారిద్దరి శరీర భాగాలు కొన్ని తెగి పడ్డాయి. మృతదేహాలను పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. కేసును పట్టణ ఎస్సై నాగరాజు దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రి వద్ద ఆ ఇద్దరు రైతుల కుటుంబీకులు, బంధువుల రోదన.. చూపరులను హృదయాలను కలిచివేసింది.
మామిళ్లగూడెం, జూలై 16: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఖమ్మం టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. నగరంలోని అజీజ్ గల్లిలో నివాసముంటున్న ప్రైవేట్ స్కూల్ హిందీ ఉపాధ్యాయురాలు ఎస్కె.రెహానా (35), గురువారం తన స్కూటీపై ఇంటి నుంచి బయటకు వెళ్లారు. పాత బస్టాండ్ నుంచి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వైపు వెళ్తున్న ఆమెను బోనకల్ వెళ్తున్న ఆర్టీసీ ఖమ్మం డిపో బస్సు వెనుక నుంచి ఢీకొంది. ఆమె తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. ఆమె భర్త జమీముద్దీన్ ఫిర్యాదుతో ఆ బస్సు డ్రైవర్ లోయ గురవయ్యపై కేసు నమోదైంది.
ఖమ్మం రూరల్, జూలై 16: విద్యుదాఘాతంతో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మృతిచెందాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని ఆరెంపుల ఆరెంపుల గ్రామస్తుడైన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మేడా రవీందర్(40), స్థానిక గ్రానైట్ ప్యాక్టరీల వద్ద విద్యుత్ స్థంభాల వైర్లను గురువారం మరమ్మతు చేస్తుండగా షాక్ తగిలింది. ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. విద్యుత్ శాఖ క్షేత్ర స్థాయి సిబ్బంది తమకు సహాయంగా ఉండేందుకు రవీందర్‌ను పిలిపించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆ సిబ్బంది సరైన భద్రతాచర్యలు తీసుకోని ఫలితంగానే రవీందర్ మృతిచెందాడన్న ఆగ్రహంతో విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట గ్రామస్తులు ధర్నాకు దిగారు. బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతుడి కుటుంబానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణాలను, రవీందర్‌ను ఎవరు పిలిపించిందీ తెలుసుకునేందుకు విద్యుత్ శాఖ స్థానిక ఏఈ వినీలను, ఏడీ కోక్యానాయక్ను ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ‘నమస్తే’ ప్రయత్నించింది. వారిద్దరూ అందుబాటులోకి రాలేదు.
పాల్వంచ, జూలై 16: బైక్ ఢీకొనడంతో యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని జగన్నాథపురం గ్రామస్తుడు తోట అరవిందకుమార్ (28), తోగ్గూడెంలోని మిషన్ భగీరథలో తాత్కాలిక ఉద్యోగిగా ఏడేళ్ల నుంచి పనిచేస్తున్నాడు. ఆయన బుధవారం రాత్రి పాల్వంచలోని కర్రీ పాయింట్లో పార్శిల్ తీసుకుని వెళ్తుండగా ఇందిరాకాలనీ వద్ద భద్రాచలం నుంచి కొత్తగూడెం వైపు వస్తున్న బైక్ (ఏపీ 20 ఏఎస్ 9267) ఢీకొంది. అరవిందకుమార్ తలకు బలమైన గాయమైంది. స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి, అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కేసును పట్టణ ఎస్సై తోట నాగరాజు దర్యాప్తు చేస్తున్నారు.