ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ ఖమ్మం, అక్టోబర్ 8: స్థానిక సంస్థల ఎన్నిక బరిలో నిలిచే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ.రాణి కుముదిని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్.. జిల్లా కలెక్టర్లతో బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి.. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాణి కుముదిని మాట్లాడుతూ మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ గురువారం ఉదయం 10:30 గంటల వరకు విడుదల చేయాలని 11వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించాలన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు రిటర్నింగ్ అధికారుల వద్ద నామినేషన్ దాఖలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ప్రతి నామినేషన్ కేంద్రం వద్ద పూర్తిస్థాయి బందోబస్తు కల్పించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతలో 149 ఎంపీటీసీ, 10 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
రిటర్నింగ్ అధికారులు, ఇతర సిబ్బందికి అవసరమైన శిక్షణను పూర్తి చేశామని తెలిపారు. వీసీ అనంతరం కలెక్టర్ అనుదీప్.. ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లపై సమీక్షించారు. నోటిఫికేషన్ జారీ, ఎలక్టోరల్ ప్రదర్శన, నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధి స్పష్టంగా తెలిసేలా మారింగ్, బందోబస్తుపై దిశానిర్దేశం చేశారు. నామినేషన్ కేంద్రాల్లో వాల్ క్లాక్ ఏర్పాటు చేయాలని, ప్రక్రియను అంతా వీడియోగ్రఫీ చేయాలన్నారు. రిటర్నింగ్ అధికారి సీరియల్ నెంబర్ వారీగా నామినేషన్లను పకాగా నమోదు చేయాలని సూచించారు. ప్రతిరోజు ఎన్ని నామినేషన్లు దాఖలు అవుతున్నాయో స్పష్టంగా నోటీసు బోర్డుపై ప్రదర్శించాలని కలెక్టర్ తెలిపారు. నివేదికలు నిర్ణీత సమయంలో సమర్పించాలని, ఏ దశలోనూ చిన్న పొరపాటు లేకుండా విధులు నిర్వర్తించాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో దీక్షా రైనా, డీఆర్డీవో సన్యాసయ్య, డీపీవో ఆశాలత, డీఎల్పీవో విజయలక్ష్మి, జిల్లా నోడల్ అధికారులు పాల్గొన్నారు.