జూలూరుపాడు/ లక్ష్మీదేవిపల్లి/ ఎర్రుపాలెం/ పెనుబల్లి/ అశ్వారావుపేట/ పినపాక/ ఇల్లెందు, మే 24 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం అగ్నికీలలు వ్యాపించాయి. వేర్వేరుగా జరిగిన ఈ ప్రమాదాల్లో భారీగా ఆస్తినష్టం సంభవించింది. జూలూరుపాడు మండలంలో అడవికి నిప్పంటుకుంది. సమీప రైతులకు తృటిలో ప్రమాదం తప్పింది. లక్ష్మీదేవిపల్లి మండలలోని ఓ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఎర్రుపాలెంలో జామాయిల్ తోట, పెనుబల్లిలో మామిడితోట, అశ్వారావుపేటలో ఆయిల్‌పాం తోట దగ్ధమయ్యాయి. పినపాక మండలంలో రెండు పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.

జూలూరుపాడులో అడవికి నిప్పు
జూలూరుపాడు ఒంటిగుడిసెకు వెళ్లే రహదారి పకన అటవీశాఖ పరిధిలో ఉన్న గుట్టపై ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. గుట్టపై ఉన్న అడవికి ప్రమాదవశాత్తూ ఒకసారిగా మంటలు అంటుకోవడంతో సమీప జామాయిల్ పొలాల రైతులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎండల తీవ్రత నేపథ్యంలో మంటలన్నీ నిమిషాల వ్యవధిలోనే గుట్ట అంతటా వేగంగా వ్యాపించాయి. గుట్టకు సరిగ్గా ఆనుకునే జూలూరుపాడు రైతుల జామాయిల్ తోటలు ఉన్నాయి. కనుచూపు మేరలో మంటలు ఎగసిపడుతూ తమ తోటల వైపు దూసుకువస్తుండడంతో వారంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై కొత్తగూడెంలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది అగ్నిమాపక శకటంతో వెంటనే వచ్చారు. గుట్టపైకి వెళ్లే మార్గం సరిగ్గా లేకపోయినప్పటికీ సిబ్బంది తీవ్రంగా శ్రమించి అతికష్టం మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. జామాయిల్ రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
కొబ్బరిపీచు ఫ్యాక్టరీలో మంటలు
లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి, కూనారం గ్రామాల్లో రైతులు తమ పంట వ్యర్థాలను కాల్చుతున్న క్రమంలో చెలరేగిన మంటలు సమీపంలోని కొబ్బరిపీచు ఫ్యాక్టరీని చుట్టుముట్టాయి. స్థానికులు వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఫ్యాక్టరీలో స్వల్ప నష్టం వాటిల్లింది.

జామాయిల్ తోటలు దగ్ధం.. రూ.40 లక్షల నష్టం..
ఎర్రుపాలెం మండలం తాటిగూడెం ప్రాంతంలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో భారీ ఎత్తున జామాయిల్ తోటలు దగ్ధమయ్యాయి. పొలాల సమీపంలోని హై ఓల్టేజ్ విద్యుత్ లైన్ల వద్ద ఏర్పాటుచేసిన ట్రాన్స్‌ఫార్మర్‌లో షార్ట్ సర్యూట్ ఏర్పడడంతో మంటలు చెలరేగాయి. గాలివేగంతో మంటలు వేగంగా వ్యాపించి సుమారు 30 ఎకరాల్లో విస్తరించిన జామాయిల్ తోటలు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో దాదాపు పది మంది రైతులకు చెందిన తోటలు నష్టపోగా, మొత్తం నష్టం రూ.40 లక్షల వరకు ఉంటుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
గంగదేవిపాడులో మామిడితోట దగ్ధం
పెనుబల్లి మండలం గంగదేవిపాడులో వరికొయ్యలకు నిప్పంటిస్తే మామిడితోటలు దగ్ధమైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు వరికొయ్యలకు నిప్పంటించగా సమీపంలో ఉన్న పలువురి మామిడితోటలు దగ్ధం కావడంతో గ్రామంలో అందరూ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అదే గ్రామానికి చెందిన అజ్మీరా రాములు ఏడు ఎకరాల్లో 280 మొక్కలు, బాణోతు జగన్ రెండు ఎకరాల్లో వంద మొక్కలు, బానోతు హోమేశ్వరరావు ఎకరం, మాలోతు హాతిరాం రెండు ఎకరాలు, కంటే రామచంద్రరావు రూ.2 లక్షల ఇంజిన్, డ్రిప్‌పైపులు, మోటార్లు, దగ్ధమయ్యాయి. మొత్తం సుమారు రూ.6 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు.
ఆయిల్‌పాం తోట దగ్ధం
అశ్వారావుపేట మండలంలో ఎండల తీవ్రతకు ప్రమాదవాశాత్తు నిప్పంటుకొని ఒక రైతు ఆయిల్‌పాం తోట దగ్ధమైంది. గంగారం సబ్ స్టేషన్ నుంచి అటవీ మార్గంలో పాపిడిగూడేనికి విద్యుత్ లైన్ ఉంది. పాపిడిగూడెం సమీప అటవీ ప్రాంతంలో ఆదివారం విద్యుత్ స్తంభంపై జంపర్లు తెగి వైర్లు కిందపడ్డాయి. ఈ దశలో మంటలు వ్యాపించి అటవీ వెదురు ప్లాంటేషన్ కాలిపోయింది. పక్కనే ఉన్న ఆల వెంకటేశ్వరరావు ఆయిల్‌పాం తోటకు మంటలు వ్యాపించడంతో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వరరావు రెండు ఎకరాలు తోట పూర్తిగా దగ్ధమైంది. తోటతోపాటు డ్రిప్ వస్తువులు కూడా కాలిపోవటంతో సుమారు రూ.5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధిత రైతు తెలిపారు.

రెండు పూరిళ్లు దగ్ధం
పంట పొలాల్లో వరి కొయ్య కాళ్లకు నిప్పంటుకొని మంటలు చెలరేగి రెండు పూరిళ్లు పూర్తిగా దగ్ధమైన ఘటన పినపాక మండలం పాండురంగాపురం పంచాయతీ విప్లగుంపులో ఆదివారం మద్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు, బాధితుల కథనం ప్రకారం.. గ్రామ సమీప పంట పొలాల్లో వరి కొయ్యకాళ్లకు మంటలు అంటున్నాయి. ఆ మంటలకు వడగాడ్పులు తోడవడంతో మంటలు గ్రామం వైపు దూసుకొచ్చి పొలాల పక్కనే ఉన్న గొగ్గలి అబ్బయ్య, కృష్ణకు చెందిన పూరిళ్లకు మంటలంటుకొని ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. గొగ్గలి అబ్బయ్య ఇంట్లో ఉన్న బంగారం, కొంత నగదుతోపాటు ఇతర వస్తువులు కలిపి సుమారు రూ.8.50 లక్షల ఆస్తినష్టం జరిగిందని పంచనామా అనంతరం ఆర్ఐ రమేశ్ తెలిపారు. అగ్ని ప్రమాదంలో కట్టుబట్టలతో బయటికి వచ్చి ప్రాణాలతో బయటపడ్డామని బాధితులు పేర్కొన్నారు.
ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో..
రెండు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లిన ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిన ఘటన ఇల్లెందు బాలాజీనగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. ఇల్లెందు ఎస్సై కథనం ప్రకారం.. ఇల్లెందు మండలం బాలాజీనగర్‌కు చెందిన పులిపాక జానకమ్మ రెండు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లారు. శనివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగి ఇంట్లోని ఫర్నిచర్, బైకు, వస్తువులు, సామాన్లు దగ్ధమయ్యాయి.