అశ్వారావుపేట, జూన్ 28 : ఆర్భాటంగా సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం రేషన్దుకాణాల్లో మిగిలిపోయిన దొడ్డుబియ్యాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. దీంతో రేషన్ దుకాణాల్లో దొడ్డుబియ్యం నిల్వలు నెలల తరబడి పేరుకుపోయి పురుగులు పడి ముక్కిపోతున్నాయి. వర్షాలతో బియ్యం నిల్వలను భద్రపరచటానికి రేషన్డీలర్లు అష్టకష్టాలు పడుతున్నారు. మరోపక్క ఎలుకలు బస్తాలపై దాడిచేసి చించేస్తున్నాయి.
ఫలితంగా సర్కార్ బియ్యం వెనక్కి తీసుకునే సమయంలో తరుగు తమపైనే పడుతుందేమోనని డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఇదే జరిగితే ఆర్థికంగా నష్టపోతామంటూ ప్రభుత్వ తీరు పట్ల అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు. జిల్లావ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం రేషన్ దుకాణాల్లో సుమారు వెయ్యి టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. కానీ 1,500 మెట్రిక్ టన్నుల వరకు ఉండొచ్చని అనాధికారిక లెక్క అంచనా ఉంది.
దొడ్డుబియ్యాన్ని త్వరగా వెనక్కి తీసుకోకుంటే పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. మూడునెలలుగా ఇరుకు గదుల్లో నిల్వ ఉండటం వల్ల బియ్యం ముక్కిపోతున్నాయి. మరోపక్క వర్షాలతో గదులకు నిమ్ము పట్టడం, ఎలుకలు దాడి చేసి బియ్యం బస్తాలను చించివేయటంతో నిల్వలు తరిగిపోతున్నాయి. బియ్యం తరిగిపోతే ఆ నష్టం ఎవరు భరించాలని రేషన్డీలర్లు ఆందోళన చెందుతున్నారు.
అధికారిక లెక్కల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా ఉన్న 443 రేషన్ దుకాణాల్లో 1,000 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. కానీ ఈ నిల్వలు 1,500 మెట్రిక్ టన్నుల వరకు కూడా ఉండొచ్చనే అంచనా అధికారికంగా వినిపిస్తున్నది. ఈ లెక్కన 1,000 మెట్రిక్ టన్నులకు ప్రభుత్వం వెచ్చించే కిలో బియ్యంకు రూ.29 చొప్పున అంచనా వేస్తే నష్టం రూ.2.90 కోట్లపైనే ఉంటుంది. అధికారిక లెక్క ప్రకారం ఒకవేళ 1,500 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు ఉంటే దీనిప్రకారం నష్టం రూ.4.35 కోట్లకు చేరుకోవచ్చని డీలర్లు అంచనా వేస్తున్నారు. దొడ్డుబియ్యాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకొని సన్నబియ్యం సక్రమ పంపిణీకి వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు.
ఏప్రిల్ నుంచి సన్నంబియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం మార్చి నెలలో మిగిలిపోయిన దొడ్డు బియ్యాన్ని వెంటనే వెనక్కి తీసుకోలేదు. దీనివల్ల భద్రపరచటం డీలర్లకు చాలా కష్టంగా ఉంది. నెలల తరబడి నిల్వ ఉండటంతో బియ్యం ముక్కిపోతున్నాయి. మరింత పాడయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మూడునెలల సన్నంబియ్యం నిల్వ చేసుకోవటానికి డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలతో బియ్యం ముక్కిపోవటంతో తరగు భారం డీలర్లపై పడితే ఆర్థికంగా నష్టపోతారు.
– కొడాలి వెంకటేశ్వరరావు, రేషన్డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు
జిల్లావ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో పేరుకుపోయిన దొడ్డుబియ్యం నిల్వలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. జిల్లాలోని 443 రేషన్ దుకాణాల్లో సుమారు 1,000 మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు ఉన్నట్లు నివేదికలు అందించాం. బియ్యం నిల్వలు వెనక్కి తీసుకోవటానికి ఇంకా ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు జారీకాలేదు. అతిత్వరలోనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
– రాధా రుక్మిణి, డీసీఎస్వో, భద్రాద్రి కొత్తగూడెం