బోనకల్లు, జూన్ 27 : ఉద్యోగోన్నతుల అనంతరం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులకు కౌన్సిలింగ్ నిర్వహించి మిగిలిన పోస్టులను భర్తీ చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జానకీపురం, రావినూతల, బోనకల్లు ఉన్నత పాఠశాలలను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీపీఎస్ విధానం రద్దు చేసి పాత విధానాన్నే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి పాఠశాలకు స్కావెంజర్ను నియమించాలని, విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే ఇంగ్లిష్లో మాట్లాడే విధంగా ఉపాధ్యాయులు బోధన చేయాలన్నారు. విద్యారంగ బలోపేతానికి ఉపాధ్యాయులతోపాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు మంజూరు చేసే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పెండింగ్లో ఉన్న డీఏలను ప్రభుత్వం విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చావా దుర్గారావు, జిల్లా నాయకులు రమాదేవి, వల్లంకొండ రాంబాబు, సదాబాబు, ఎస్.వీరబాబు, బోనకల్లు మండల అధ్యక్షుడు బీ.ప్రీతం, ప్రధాన కార్యదర్శి గుగులోతు రామకృష్ణ, లెనిన్స్టన్ తదితరులు పాల్గొన్నారు.