బోనకల్లు, ఆగస్టు 05 : బోనకల్లు మండల పరిధిలోని చిన్నబీరవల్లి గ్రామంలో నానో యూరియా వాడకంపై రైతులకు క్షేత్ర ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మండల వ్యవసాయ అధికారి పసునూరి వినయ్ కుమార్ మాట్లాడుతూ.. సాధారణ యూరియాలో నత్రజని వినియోగ సామర్థ్యం 30 నుండి 40 శాతం ఉంటుందన్నారు. నానో యూరియా పిచికారి చేయడం వల్ల 80 నుంచి 85 శాతం వరకు నత్రజని వినియోగ సామర్థ్యం ఉంటుందని తెలిపారు. నానో యూరియా, నానో డీఏపీ కొన్ని రకాల పురుగుమందులతో కలిపి కూడా పిచికారి చేసుకోవచ్చన్నారు. ఈ విధంగా చేయడం వల్ల రైతులకు ఖర్చు కూడా ఆదా అవుతుందన్నారు.
ఇది మొక్కల నత్రజని అవసరాన్ని సమర్ధవంతంగా తీరుస్తూ, ఆకులలో కిరణజన్య సంయోగక్రియను పెంచుతుందన్నారు. వేర్లలో కణజాలమును వృద్ధి చెందిస్తుందన్నారు. ఉపయోగకరమైన పిలకలను, శాఖలను పెంచి పంట ఉత్పత్తుల పోషక విలువలను పెంచుతుందన్నారు. పంట ఉత్పాదకతను పెంచి, పంట సాగు ఖర్చు తగ్గించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచుతుందన్నారు.
రైతులు 500 మి.లీ నానో యూరియా బాటిల్‌ను సులభంగా ఉపయోగించవచ్చని, నిల్వ చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ షేక్ హుస్సేన్ సాహెబ్, గ్రామ రైతులు పాల్గొన్నారు.