కారేపల్లి, ఏప్రిల్ 17 : గ్రామ స్థాయిలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తున్న తమకు బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతూ గురువారం ఫీల్డ్ అసిస్టెంట్లు తాసీల్దర్, ఎంపీడీఓకు వినతి పత్రాలను అందజేశారు. ఆ సంఘం ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి బి.నర్సయ్య మాట్లాడుతూ.. మూడు నెలలుగా వేతనాలు లేక ఫీల్డ్ సిస్టెంట్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేధన వ్యక్తం చేశారు. అదే విధంగా ఎఫ్ఏలను ఎన్టీటీఈలుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం గత 20 ఏండ్లుగా పని చేస్తున్నతమకు పేస్కేల్ వర్తింపజేసి, వేతనాలను పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. దాదాదు రెండేళ్లు కావస్తున్నా ఇంత వరకు తమకు ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు తాటి జానకి, ఈసం భద్రం, గుగులోతు కేవాలభూక్య గణేశ్, సందీప్, సాయమ్మ, సుజాత పాల్గొన్నారు.