కూసుమంచి, జూన్ 13 : కొన్నిచోట్ల అధిక ధరలకు విత్తనాలు విక్రయిస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారి లైసెన్స్లు రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి(డీఏవో) విజయనిర్మల హెచ్చరించారు. కూసుమంచి, నాయకన్గూడెంలోని పలు విత్తన, ఎరువుల దుకాణాలను గురువారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా సాగుకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దన్నారు.
అయితే కొందరు వ్యాపారులు కావాలనే కొన్ని కంపెనీలను రైతులకు అంటగట్టేందుకు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోందని, అలాంటి వారిని సహించేది లేదన్నారు. రైతులకు అమ్మిన విత్తనాలకు సంబంధించి సరైన లాట్ నెంబర్లు ఉండాలని, నిత్యం దుకాణాల్లో స్టార్ రిజిస్టర్లు నిర్వహించాలని సూచించారు. ఎక్కడ తేడా వచ్చినా.. రోజువారీ రిజిస్టర్లు తప్పుగా రాసినా అటువంటి వ్యాపారులపై చర్యలు తప్పవన్నారు. ఎరువులు, విత్తన దుకాణాలను అధికారులు నిత్యం పర్యవేక్షిస్తారని, వారికి ఏమాత్రం అనుమానం వచ్చినా చర్యలు తీసుకుంటారన్నారు. అనంతరం దుకాణాల్లో స్టాక్ రిజిస్టర్లు, బోర్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏడీఏ విజయ్చంద్ర, ఏవో వాణి అదితరులు పాల్గొన్నారు.