ఖమ్మం, జనవరి 8 : తెలుగు రాష్ర్టాల్లోని ప్రముఖ పర్వదినమైన సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణం కష్టమనే విషయం స్పష్టంగా కన్పిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదాయం గణనీయంగా ఉన్నప్పటికీ అందుకు తగిన విధంగా సర్వీసులు ఉండడం లేదు. అన్ని ప్రాంతాలకూ అరకొర బస్సులే. పైగా ఇప్పటికే ఆర్టీసీ బస్సులు వెళ్లని గ్రామాలు ఇంకా అనేకం ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీలోనే మొదటగా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసింది.
ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమలు చేసింది. దీని వల్ల మహిళలు అధిక సంఖ్యలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. దీంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కానీ.. అందుకు అనుగుణంగా బస్సులను పెంచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఫలితంగా పండుగ సీజన్లలో నడిపే ప్రత్యేక బస్సులకు మంగళం పాడినట్లయింది. మరో నాలుగు రోజుల్లో జరుపుకునే అతి పెద్ద పండుగ అయిన సంక్రాంతికి ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడపడం కష్టంగానే కన్పిస్తోంది.
ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే అనేక గ్రామాలకు ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. తమ గ్రామాలకు ఆర్టీసీ బస్సులను నడపాలంటూ అనేక గ్రామాల ప్రజలు ఏడాది కాలంగా అధికారులు, ప్రజాప్రతినిధులకు మొర పెట్టుకుంటూనే ఉన్నారు. అయినా ఫలితం ఉండడం లేదు. ప్రయాణికుల డిమాండ్‌కు తగ్గట్టు బస్సుల సంఖ్యను పెంచాలని జిల్లా అధికారులు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినా వాటి గురించి పట్టించుకునే వారు కరువయ్యారు. ఈ స్థితిలో పండుగలకు నడపాల్సిన స్పెషల్ బస్సులపై ఉచిత ప్రయాణం ప్రభావం స్పష్టంగా కన్పిస్తోంది.
ఆర్టీసీ ఖమ్మం రీజియన్ పరిధిలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఏడు డిపోలు ఉన్నాయి. ఖమ్మం, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, ఇల్లెందు డిపోల్లో 519 బస్సు సర్వీసులను నడుపుతున్నారు. వీటిలో ఆర్టీసీవి 289 బస్సులు కాగా.. 230 అద్దె బస్సులు. వీటిలో పల్లె వెలుగు 177, లహరి 10, రాజధాని 32, సూపర్‌లగ్జరీ 82, డీలక్స్ 36, ఎక్స్‌ప్రెస్ 178, మినీ బస్సులు 4 ఉన్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని అమలు చేశాక మహిళా ప్రయాణికుల సంఖ్య అమాంతం పెరిగింది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ప్రతి రోజూ 2.25 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. పండుగల సీజన్లలో ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది. ఖమ్మం రీజియన్‌లో ఆర్టీసీకి ప్రతి రోజూ రూ.1.40 కోట్ల ఆదాయం వస్తోంది. అయినా ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులను నడపడంలో సంస్థ వైఫల్యం చెందుతోందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఈ నెల 9 నుంచి 14 వరకు హైదరాబాద్ నుంచి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు స్పెషల్ సర్వీసులు కేటాయించింది. ఇందులో రిజర్వేషన్ సౌకర్యం కలిగినవి 195, రిజర్వేషన్ సౌకర్యం లేనివి 230, ఇతర బస్సులు 160 కలిపి మొత్తం 585 బస్సులు ఉన్నాయి. అదేవిధంగా ఈ నెల 15 నుంచి 19 వరకు ఖమ్మం రీజియన్ నుంచి హైదరాబాద్‌కు 445 బస్సులు నడుపుతున్నట్లు ఖమ్మం ఆర్టీసీ రీజియన్ ఆర్ఎం తెలిపారు.
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా అందుకు తగిన సంఖ్యలో బస్సులను మాత్రం పెంచడంలేదు. దీని ద్వారా ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో సిబ్బందిపై తీవ్రమైన ఒత్తిడి పడుతోంది. అయినా వారి బాగోగుల గురించి పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
ఖమ్మం రీజియన్‌లో 132 బస్సులు అదనంగా కావాలని అధికారులు ప్రతిపాదనలు పంపినా ఉన్నతాధికారుల నుంచి స్పందన లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రూట్లకూ బస్సులు నడుపుతామని హామీ ఇచ్చారు. కానీ.. అవి ప్రగల్భాలుగానే మిగిలిపోయాయి. కనీసం కొత్త బస్సులూ ఇవ్వడం లేదు. అదేవిధంగా డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉంది. గత 12 ఏళ్ల నుంచి కొత్త డ్రైవర్లను ఆర్టీసీ నియమించలేదు. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.