ఖమ్మం వ్యవసాయం, జూలై 4 : గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మిర్చి సాగు చేసిన రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు. సీజన్లో పంట చేతికి వచ్చిన సమయంలో మార్కెట్లో తేజారకం పంటకు మంచి డిమాండ్ పలికింది. ఒకానొక దశలో క్వింటా రూ.22 వేలకు పైచిలుకు కూడా పలికింది. సీజన్ చివరిలోనూ రూ.20 వేల నుంచి రూ.21 వేల వరకు గరిష్ట ధర పలికింది. అయితే రాబోయే రోజుల్లో క్వింటా రూ.25 వేలకు పైగా పలికే అవకాశం ఉందంటూ గత సీజన్లో మిర్చి రైతుల వద్ద కొందరు అడ్తీ వ్యాపారులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. చైనా కంపెనీలు ఇంకా కొనుగోళ్లు ప్రారంభించలేదని, త్వరలోనే కొనుగోళ్లు చేపడుతాయని ఆశ చూపారు. దీంతో వేలాది మంది రైతులు జిల్లావ్యాప్తంగా ఉన్న కోల్డ్ స్టోరేజీల్లో పంటను నిల్వ చేసుకున్నారు. మరికొందరు వ్యాపారులు కూడా నిల్వలు పెట్టుకున్నారు. తీరా ఈ సీజన్లో చూస్తే ధరలు పాతాళంలో ఉన్నాయి. దీంతో ఏసీల్లో నిల్వ పెట్టుకున్న రైతులు లబోదిబోమంటున్నారు. గత సీజన్లో విక్రయించుకున్నా బాగుండేదేమోనంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిల్వ పెట్టుకున్న పంటను ఇప్పటికైనా అమ్ముకుందామా.. లేదా మరికొద్ది రోజులపాటు ఆపుకుందామా.. అనేది తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు.
ఒక్కరోజు వ్యవధిలోనే రూ.2 వేల తగ్గుదల
ఖమ్మం ఏఎంసీలో తేజారకం ఏసీ మిర్చి ధర ఒక్కరోజు వ్యవధిలోనే సుమారు రూ.2 వేలు తగ్గడంతో మిర్చి రైతులు ఆందోళనకు గురయ్యారు. వారం రోజుల క్రితం వరకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో క్వింటా ఏసీ రకం ధర రూ.19,500 నుంచి రూ.20 వేల వరకూ గరిష్ట ధర పలికింది. బుధవారం కూడా రూ.19,500 ధర పలికింది. అయితే ఏసీ రకం పంటకు ఆ ధర చాలా తక్కువే అయినప్పటికీ రైతులు మరికొంత కాలం వేచి చూద్దామనే ధోరణితో ఉంటూ వస్తున్నారు. తీరా గురువారం ఉదయం జరిగిన జెండాపాట సమయానికి కేవలం 34 మంది రైతులు 928 బస్తాలను మాత్రమే యార్డుకు తీసుకొచ్చారు.
అనంతరం జరిగిన జెండాపాటలో క్వింటా గరిష్ట ధర రూ.17,600 పలుకగా.. మధ్య ధర రూ.16,500, కనిష్ట ధర రూ.10 వేలు పలికింది. సాధారణ రకం పంటకు క్వింటా గరిష్ట ధర రూ.10 వేలు, కనిష్ట ధర రూ.9,800, తాలు రకం పంటకు గరిష్ట ధర రూ.7,500, కనిష్ట ధర రూ.5,750 చొప్పున పలికాయి. ప్రస్తుతం వానకాలం వ్యవసాయ పనులు జోరందుకోవడంతో పెట్టుబడి కోసం రైతులు పంటను మార్కెట్లో విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. సరిగ్గా ఈ సమయంలో మార్కెట్లో మిర్చి పంట ధరలు భారీగా పడిపోతుండడంతో మిర్చి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒక్కరోజు వ్యవధిలోనే ఏకంగా రూ.2 వేల ధర తగ్గడాన్ని కేవలం ఖమ్మం మార్కెట్లోనే చూస్తున్నామని రైతులు చెబుతుండడం గమనార్హం.
కోల్డ్ స్టోరేజీల్లో 38 లక్షల బస్తాల నిల్వలు..
ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని కోల్డ్ స్టోరేజీలు పంట ఉత్పత్తులతో నిండిపోయాయి. మొత్తం 48 కోల్డ్ స్టోరేజీల్లో ప్రస్తుతం 38,19,274 బస్తాలు నిల్వ ఉన్నాయి. కానీ.. రోజురోజుకూ మిర్చి పంట ధర తగ్గుతుండడంతో ఇంతకాలం పంటను నిల్వ చేసుకున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సీజన్లోనే ధర సగానికి సగం తగ్గింది
ఈ సీజన్లో మిర్చిపంట ధర సగానికి సగం తగ్గుతుందని అనుకోలేదు. పంట వచ్చిన సమయంలో నేను ఇదే మార్కెట్కు తీసుకొచ్చాను. అయితే అప్పుడు క్వింటా రూ.20 వేలు పెట్టి వ్యాపారులు కొనుగోలు చేశారు. కానీ.. ఈరోజు చూస్తే అదే పంటకు క్వింటా రూ.10 వేలు మాత్రమే ధర పలికింది. ఆ సీజన్లోనే కొంత పంటను అమ్ముకున్నాను. మిగిలిన పంటను ఈరోజు తీసుకొచ్చాను. కానీ.. ధర చూస్తే ఆశ్చర్యమేస్తోంది. ఏసీలో పంట దాచుకున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
-మేకపోతుల వీరబాబు, రైతు, చింతపల్లి