టేకులపల్లి మండలంలోని బేతంపూడి రెవెన్యూ విలేజ్ వీడని చిక్కుముడిగా ఉంది. ఇది ఇప్పటి సమస్య కాదు.. దశాబ్దాలుగా వస్తున్నది. ఒక్క రెవెన్యూ గ్రామంలో 16 పంచాయతీలు, 22 వేల ఎకరాలు ఉన్నాయి. భూమి రికార్డులు రెండు అడంగల్ పహాణీలు బేతంపూడి, సులానగర్గా ఉన్నాయి. రెండు పహాణీల్లోనూ సర్వే నెంబర్లు 1 నుంచి ప్రారంభం కావడంతో పరిష్కరించలేని సమస్యగా ఉండిపోయింది. ఈ నేపథ్యంలో ఎందరో రైతులు పట్టాలు లేక ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం పొందలేకపోతున్నారు. భూమి ఉండి కూడా ఎటువంటి ప్రయోజనం ఉండడం లేదని మదనపడుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ‘రైతు భరోసా’ పథకానికి లబ్ధిదారులను గుర్తించే పనిలో భాగంగా అధికారులు సర్వే చేస్తున్నారు. దీంతో భూముల సర్వే, లబ్ధిదారుల ఎంపిక ఎలా చేస్తారోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
తరతరాలుగా వస్తున్న తమ భూ సమస్యలను పరిష్కరించాలని ముక్తకంఠంతో కోరుతున్నారు బేతంపూడి రెవెన్యూ విలేజ్ రైతులు. స్వాతంత్య్రం రాకముందు తాతముత్తాతల నుంచి సాగు చేస్తున్న భూములకు పట్టాలు లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకు సాగు చేస్తున్నారే కానీ పట్టాలు ఉండవు.. బ్యాంక్‌లో వ్యవసాయం రుణాలు ఇవ్వరు.. విద్యుత్ లైన్ కోసం అనుమతి ఇవ్వరు.. మొత్తానికి భూమి ఉండి కూడా రైతులకు ఎలాంటి ఉపయోగం లేకుండా ఉంది. 1956లో బేతంపూడి రెవెన్యూ పరిధిలో భూమి శిస్తులు బ్లాక్ నెంబర్లలో, నిజాం కాలం నుంచి రికార్డుల ద్వారా వసూలు చేసేశారు.
1982 తరువాత తాలూకాలు రద్దు చేసి మండలాలు ఏర్పాటు చేసిన క్రమంలో అధికారుల నిర్లక్ష్యం వలన ఆరు రెవెన్యూ విలేజ్‌లు కావలసిన ప్రాంతాన్ని ఒకే రెవెన్యూ విలేజ్‌గా ఏర్పాటు చేశారు. దీనివల్ల గతంలో ఆరు గ్రామ పంచాయతీలు ఉండగా.. ప్రస్తుతం 16 గ్రామ పంచాయతీలున్నాయి. రెవెన్యూపరంగా 22 వేల ఎకరాల భూమి ఉంది. భూమి రికార్డులను రెండు అడంగల్ పహాణీలు ఒకటి బేతంపూడి, రెండోది సులానగర్గా ఉన్నాయి. మాన్యువల్ రికార్డులు ఉన్న రోజుల్లో అధికారులు నెట్టుకొచ్చారు. ఆన్లైన్ వచ్చిన నాటినుంచి రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ‘రైతు భరోసా’ పథకం లబ్ధిదారులను గుర్తించే పనిలో ఉంది. ఇందుకోసం అధికారులు ముమ్మరంగా సర్వే చేస్తున్నారు. ఈ క్రమంలో భూముల గందరగోళం మధ్య లబ్ధిదారులను, వ్యవసాయేతర భూమిని ఎలా గుర్తిస్తారోనని ఈ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో రెవెన్యూ మంత్రి ఉండడంతో సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
ఒకే సర్వే నెంబర్‌తో మొదలు..
బేతంపూడి పహాణీలో 1 నుంచి 68వ సర్వే నెంబర్ వరకు బేతంపూడిలోను మళ్లీ 1 నుంచి 48 వరకు కోయగూడెంలోను, సులానగర్ పహాణీలో 1 నుంచి 68 వరకు సులానగర్, కోయగూడెం గ్రామాల్లో ఉండటం వల్ల ఆన్‌లైన్‌కు వచ్చేసరికి ఈ మూడు నెంబర్ల భూములు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నా సర్వే నెంబర్లు ఒక్కటే కావడంతో రైతులకు పట్టాలు కాలేదు. అలాగే 169 నుంచి 336 సర్వే నెంబర్ వరకు బేతంపూడి, కోయగూడెం, బద్దుతండా, కుంటల్ల, టేకులపల్లి, రోళ్ళపాడు, తొమ్మిదోమైలుతండా, తడికలపూడి గ్రామ పంచాయతీల్లో డబుల్ సర్వే నెంబర్లు ఉండడంతో వీరిలో తొలుత ఆన్లైన్ చేసిన రైతులకు ఇబ్బంది లేదుకానీ తర్వాత రైతులకు పట్టాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. మిగిలిన 337వ సర్వే నెంబర్ నుంచి 1074 వరకు ఉన్న సర్వే నెంబర్లు సింగిల్‌గానే ఉన్నాయి. వాటిలో కోయగూడెం ప్రాంతంలో ఉన్న 169వ సర్వే నెంబర్లో 1956 నుంచి పట్టాలు ఉన్నాయి కానీ.. సర్వే నెంబర్ ఒక్కచోట ఉన్న భూములు మాత్రం వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయి. గతంలో అధికారులు వాటిని సరైన విధంగా నెంబర్లు ఇవ్వకపోవడంతో ఒకేచోట భూమి లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.
నాకు 30 ఏళ్లుగా పట్టా లేదు
నాకు మా తండ్రి స్వామి వద్ద నుంచి సర్వే నెంబర్ 17లో 4.35 ఎకరాలు, సర్వే నెంబర్ 44లో 0.31 కుంటల భూమి ఉంది. మొత్తం కలిసి నా పేరుపై 5.26 ఎకరాల భూమి వారసత్వ పట్టా 30 ఏళ్ల క్రితం వచ్చింది. కానీ.. 2012లో ఆన్లైన్ చేసే క్రమంలో నా నెంబర్ మీద సులానగర్ రైతులకు పట్టా ఇచ్చారు. దీంతో నాకు పట్టా ఇప్పటివరకు రాలేదు. రైతుబంధు రాలేదు. బ్యాంక్ రుణమాఫీ కాలేదు. భూమి ఉండి కూడా లబ్ధి పొందలేకపోతున్నాం.
-చిట్టిబోయిన ముత్తయ్య, బేతంపూడి, టేకులపల్లి
వారసత్వ భూమికి పట్టా రావట్లేదు..
నాకు వారసత్వంగా బేతంపూడి పహాణీలో సర్వే నెంబర్ 18లో 0.20 కుంటల భూమి వచ్చింది. దానిని నా పేరు మీదకు మార్చాలని అనేకసార్లు దరఖాస్తు చేశాను. అయినా పట్టా రాలేదు. సులానగర్, బేతంపూడి రెండు భూమి రికార్డులకు ఆన్లైన్లో ఒకే రెవెన్యూ గ్రామం వల్ల పట్టాలు కావడం లేదని అధికారులు చెబుతున్నారు.
-జంగిలి సాంబశివరావు, బేతంపూడి, టేకులపల్లి
ప్రతిపాదనలు పంపాం..
టేకులపల్లి మండలంలో మొత్తం ఆరు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వాటిలో అతిపెద్దది బేతంపూడి. దీనికి బేతంపూడి, సులానగర్ రెండు పహాణీలు ఉండడం వల్ల ఆన్లైన్లో ఆర్‌ఎస్‌ఆర్‌లో విస్తీర్ణ సమస్యలు ఉన్నాయి. దీనిపై ఉన్నతాధికారులకు విన్నవించాం. బేతంపూడి రెవెన్యూ విలేజ్‌లో సులానగర్ డమ్మీ రెవెన్యూ గ్రామానికి ప్రతిపాదన సైతం పంపాం. భూసమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రత్యేక రెవెన్యూ విలేజ్ ఏర్పాటు చేయాల్సి ఉంది.
-నాగభవాని, టేకులపల్లి తహసీల్దార్