సీజన్ ఏదైనా రైతులు పండించిన పంటను కొనుగోలు చేసే విషయంలో మాత్రం కాంగ్రెస్ సర్కారు చుక్కలు చూపిస్తోంది. పంటలు వేసే వరకు విత్తనాలు, ఎరువుల సమస్యతో సతమతమైన రైతన్నలు.. పంటలు చేతికొచ్చాక వాటిని అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. కర్షకులు పండించిన పంటలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనేక తిరకాసులు పెడుతుండడంతో కొనుగోలు కేంద్రాల వద్ద వారు అరిగోస పడుతున్నారు. ఆ ఇక్కట్లు తాళలేక దళారులకు, ప్రైవేటు వ్యాపారులకు విక్రయించుకుంటున్నారు. దీంతో అన్నదాతల ఆరుగాలపు శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదు.
-భద్రాద్రి కొత్తగూడెం, మే 5 (నమస్తే తెలంగాణ)
గత కేసీఆర్ సర్కారులో రైతు ఎంత దిగుబడి సాధించినా చివరి గింజ వరకూ ప్రభుత్వమే కొనుగోలు చేసేది. వారం రోజులు గడవకముందే రైతుల ఖాతాల్లో ఆ సొమ్ములు జమచేసేది. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు పాలనలో పంటల కొనుగోలుకే దిక్కులేకుండా పోయింది. ‘మా పంటను కొనండి సారూ..’ అంటూ పది రోజుల క్రితం అన్నపురెడ్డిపల్లి మండలంలో ఓ వరి రైతు నడిరోడ్డుపై ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. అదేగాక రైతులు ధర్నాకు కూడా దిగారు. చివరికి కలెక్టర్ కూడా అదే మండలానికి వెళ్లి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. అయితే, ఇలాంటి సమస్యలు భద్రాద్రి జిల్లా అంతటా ఉన్నాయి.
ఆర్భాటంగా ప్రకటనలు..
సీజన్ వచ్చిందంటే చాలు.. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం ఆనవాయితీ. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం.. ఆయా శాఖల అధికారులతో ఆర్భాటంగా ప్రకటనలు చేయిస్తోంది. ప్రజాప్రతినిధులు కూడా ‘ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం’ అంటూ అదరగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో ఎక్కడా అవి ఆచరణలోకి రావడం లేదు. భద్రాద్రి జిల్లాలో రైతులు సాగు చేసిన వరి రకాలు వేరు. ప్రభుత్వం కొనే రకాలు వేరు. సన్న రకం ధాన్యాన్ని పండించినా, దొడ్డు రకం ధాన్యాన్ని పండించినా.. ఇలాంటి రకాన్ని తాము కొనబోమంటూ ప్రభుత్వం తిరకాసు పెడుతోంది.
దీంతో చాలామంది రైతులు తమ పంటలను ప్రైవేటులో అమ్ముకుంటున్నారు. దీంతో ప్రభుత్వం ఇస్తానన్న క్వింటాకు రూ.500 బోనస్‌కు కూడా ఎగనామం పెడుతోంది. పైగా, రైతులే ప్రైవేటు మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి కల్పిస్తోంది. ఇందుకు అనేక ఉదాహరణలు కన్పిస్తున్నాయి. లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే, ‘కొనుగోలు కేంద్రం’ పేరుతో ఉన్న ఫ్లెక్సీ తప్ప అక్కడ మరేమీ లేదు. కనీసం పరికరాలు కూడా లేవు. సమీపంలోని కల్లంలో కొందరు రైతులు తమ ధాన్యాన్ని ఆరబోసి ఉన్నారు. వారిని ‘నమస్తే’ పలుకరించగా.. ధాన్యం వస్తే కొంటామని అధికారులు చెప్పారు. కానీ, దొడ్డు రకం వస్తే కొనడం కుదరదన్నారు..’ అంటూ ఆ రైతులు వివరించారు.
మక్కల కొనుగోలుకూ తిరకాసు
ఇక మక్కలు కొనుగోళ్ల విషయంలో కూడా అదే పరిస్థితి ఉంది. ఎకరానికి 20 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో చాలామంది రైతులు దళారులకు విక్రయిస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో మక్కలు ఎక్కువగా పండించిన చండ్రుగొండ మండలంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జూలూరుపాడు కేంద్రానికి తీసుకెళ్లినా అక్కడ పెద్ద క్యూ ఉండడంతో రైతులు తిరిగి ఇంటికి వస్తున్నారు. గత్యంతరం లేక ఎక్కువ మంది రైతులు బయట వ్యాపారులను ఆశ్రయించి తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు.
20 రోజులుగా కొనుగోలు కేంద్రం వద్దే ఉంటున్నా..
ఇరవై రోజులుగా నా ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దనే ఉంచాను. అయినా ఇంకా కాంటాలు వేయలేదు. తేమ రాలేదని నిర్వాహకులు చెబుతున్నారు. మా ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతులందరమూ కలిసి ధర్నా కూడా చేశాం. కలెక్టర్ కూడా వచ్చారు. అయినా కొనుగోలు చేయడంలో నిర్వాహకులు ఇబ్బందులు పెడుతున్నారు. మా రైతుల గోస ప్రభుత్వానికి ఎంకెప్పుడు అర్థమవుతుంది?
-మిరియాల కృష్ణ, రైతు, మర్రిగూడెం, అన్నపురెడ్డిపల్లి
మా దగ్గర మక్కల కొనుగోలు కేంద్రం లేదు..
మా ఊర్లో అధిక శాతం మంది రైతులు ఈసారి మొక్కజొన్నను ఎక్కువగా సాగు చేశాం. కానీ, ప్రభుత్వం మాత్రం మా ఊరిలో కొనుగోలు కేంద్రం పెట్టలేదు. ఇప్పటిదాకా పొలంలో ఆరబెట్టుకొని ఉన్నాం. అకాల వర్షం వస్తే పంట మొత్తం తడిసిపోతుంది. మూడు మండలాలకు కలిపి ఒకచోట కేంద్రాన్ని పెట్టారు. అక్కడకు వెళ్తే కూపన్లు ఇచ్చి పంపుతున్నారు. గోదాములకు వెళ్లడానికి లారీలు రావడం లేదని చెబుతున్నారు.
-దరావత్ రవి, మక్క రైతు, తిప్పనపల్లి, చండ్రుగొండ