సత్తుపల్లి టౌన్, జనవరి 29: సత్తుపల్లి మండలం బుగ్గపాడులోని మెగా ఫుడ్‌పార్క్‌ను ఈప్రాంత రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. త్వరలో పార్క్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభిస్తారన్నారు. సోమవారం ఆయన మెగా ఫుడ్ పార్క్‌ను సందర్శించి మాట్లాడారు. రైతులు, ప్రొఫెసర్లు, రీటైలర్లను ఏకతాటిపైకి తెచ్చి, వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు అనుసంధానించేందుకే ఫుడ్‌పార్క్ నిర్మాణం జరిగిందన్నారు. ప్రస్తుతం పార్క్‌కు జీడి పప్పు, మామిడి ప్రాసెసర్లు అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే అన్ని పంటలకు ప్రాసెసర్లు వస్తాయన్నారు. రైతులు పండించిన పంటను ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చన్నారు.
ఫుడ్ ప్రాసెసింగ్ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీరియస్‌గా తీసుకుని ఇప్పటికే కొన్ని కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారన్నారు. ఇదే కోవలో ఖమ్మం జిల్లా కోసం గోద్రేజ్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. రైతుల అభ్యున్నతి కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,500 రైతువేదికలో ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసి వ్యవసాయ శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయ ఆచార్యులు, ఆదర్శ రైతులతో ఆధునిక సాగు విధానాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఫుడ్ పార్కు పరిధిలో మిగిలిన ఉన్న పనులను సత్వరం పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు రాగమయి, జారే ఆదినారాయణ, పరిశ్రమలశాఖ జోనల్ మేనేజర్ పవన్‌కుమార్, జిల్లా పరిశ్రమల విభాగ అధికారి అజయ్‌కుమార్, కల్లూరు ఆర్డీవో అశోకచక్రవర్తి, ఏసీపీ రామానుజం ఉన్నారు.