ఖమ్మం వ్యవసాయం/ ఖమ్మం రూరల్, డిసెంబర్ 18: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జరుగుతున్న నిర్మాణాలన్నీ నిబంధనలకు అనుగుణంగానే జరగాలని రాష్ట మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ పీ.లక్ష్మీబాయి సూచించారు. యార్డుల్లో వర్షపు నీరు నిలువకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో సోమవారం పర్యటించిన ఆమె.. అడిషనల్ డైరెక్టర్లు లక్ష్మణుడు, రవికుమార్, ఎస్ఈ లక్ష్మణ్గౌడ్లతో కలిసి ఖమ్మం, మద్దులపల్లి ఏంఎసీలోని నిర్మాణాలను పరిశీలించారు. తొలుత ఖమ్మం ఏఎంసీలో చైర్పర్సన్ దోరేపల్లి శ్వేత, సెక్రటరీ రుద్రాక్ష మల్లేశం, డీఎంవో అలీంలు ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆమె ప్రధాన యార్డులో జరుగుతున్న ఓపెన్ షెడ్ల నిర్మాణాలను పరిశీలించారు. నిర్మాణాలన్నీ నిబంధనల ప్రకారమే ఉండాలని సూచించారు. అనంతరం పత్తియార్డును సందర్శించారు. రైతులు తీసుకొచ్చిన పత్తిపంటను కూడా పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం హోల్‌సేల్ కూరగాయల మార్కెట్‌ను కూడా పరిశీలించారు. మార్కెటింగ్ శాఖ అధికారులు మల్లేశం, రాజునాయక్, బజార్, వజీరుద్దీన్, కమలాకర్‌రెడ్డి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
నిర్మాణ పనులను ఇంజినీరింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ పీ.లక్ష్మీబాయి ఆదేశించారు. కమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలో నిర్మాణ దశలో ఉన్న వ్యవసాయ మార్కెట్ పనులను సోమవారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆమెకు ఏఎంసీ సెక్రటరీ వీరాంజనేయులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అనంతరం నూతన మార్కెట్ నిర్మాణ బ్లూప్రింట్‌ను, ప్రస్తుత నిర్మాణాల స్థితిని అడిగి తెలుసుకున్నారు.