బోనకల్లు, మే 05 : రైతులు మార్కెట్లో ఆదాయం వచ్చే పంటలను సాగు చేయాలని మధిర వ్యవసాయ సహాయ సంచాలకులు ఎస్.విజయ చంద్ర సూచించారు. సోమవారం బోనకల్లు మండలంలో గల రాయన్నపేట రైతు వేదికలో వ్యవసాయ శాఖ, వ్యవసాయ పరిశోధన స్థానం, మధిర ఆధ్వర్యంలో రైతు ముంగిట శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులు యూరియా వాడకం తగ్గించుకోవడం వల్ల సాగు ఖర్చు తగ్గించుకోవచ్చన్నారు. రసాయనాలు తగ్గించుకోవడం వల్ల నేలతల్లి ఆరోగ్యం కాపాడుకోవడం, పంట మార్పిడి చేయడం ద్వారా పంటలకి వచ్చే చీడపీడలు నివారించవచ్చన్నారు. రైతులు పంట సాగు ప్రారంభం నుంచి పంట కోసే వరకు ఉన్న రసీదులను భద్రపరుచుకోవాలన్నారు.
పత్తిలో కంది, మిర్చిలో బంతి, వరి పంట తర్వాత వ్యర్ధాలను కాల్చకుండా భూమిలో కలియదున్నుకోవాలన్నారు. మధిర పరిశోధన స్థానం శాస్త్రవేత భరత్ మాట్లాడుతూ.. వానకాలంలో వరి తర్వాత యాసంగిలో మినుములు, పెసర, బొబ్బర్లు వంటి పంటలు వేయాలని సూచించారు. ఈ సాగు ద్వారా భూమిలో సేంద్రియ పదార్థం పెరిగి నేల ఆరోగ్యం బాగు అవుతుందన్నారు. కీటక శాస్త్రవేత్త నాగస్వాతి మాట్లాడుతూ.. వరి, పత్తి, మిర్చితో పాటు మొక్కజొన్న పంటల్లో చీడపీడల యాజమాన్యం గురించి వివరించారు. అనంతరం అన్ని రైతు వేదికలో ఫార్మ్ రిజిస్ట్రీ రైతు నమోదు కార్యక్రమం ప్రారంభించారు. ఈ సమావేశంలో మధిర ఆత్మ ఛైర్మన్ కర్నాటి రామ కోటేశ్వరరావు, ఏఈఓ నాగసాయి కలకోట, రాయన్నపేట రైతులు పాల్గొన్నారు.