బోనకల్లు, మే 09 : భూ సమస్యలు ఉన్నవారు భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు చేసుకోవాలని ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు అన్నారు. శుక్రవారం బోనకల్లు మండలంలోని చొప్పకట్లపాలెం, నారాయణపురం గ్రామాల్లో భూ భారతి రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులు భూ సమస్యలపై చేసిన దరఖాస్తులను ఆర్డీఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ భారతి చట్టం రైతులకు ప్రయోజనం కలిగిస్తుందన్నారు.
గతంలో మిస్సింగ్ సర్వే నంబర్లు, పాస్ పుస్తకాలు రానివారు, వివిధ సమస్యలపై ఆధారాలతో కూడిన సమాచారాన్ని దరఖాస్తులో పొందపరచాలన్నారు. దరఖాస్తును పరిశీలించి రైతులకు భూ సమస్యలను పరిష్కరించడానికి అవకాశం ఉంటుందన్నారు. తప్పనిసరిగా రైతులు దరఖాస్తులు ఇచ్చిన వెంటనే అధికారులు రసీదు ఇవ్వాలన్నారు. ఈ సదస్సులో బోనకల్లు తాసీల్దార్ అనిశెట్టి పున్నంచందర్, మధిర తాసీల్దార్ రాచబండి రాంబాబు, ఆర్ఐలు మైధిలి నవీన్‌కుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.