అన్నదాతలు వానకాలం వరి సాగుకు సిద్ధమవుతున్నారు. ఎగువన కురిసిన వర్షాలకు కృష్ణానది పరవళ్లు తొక్కుతుండడంతో సాగర్ ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురించాయి. జూరాల, ఆల్మట్టి నుంచి వరద వస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్టు మరో 8 అడుగులైతే పూర్తిస్థాయిలో నిండనుంది. తరువాత వచ్చిన వరద మొత్తం నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వదలనున్నారు. సాగర్ ఎడమ కాలువ పరిధిలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 5 లక్షల ఎకరాల వరి మొదటి జోన్ కింద సాగవుతుండగా ఖమ్మం జిల్లాలో పాలేరు రిజర్వాయర్ కింద 2.54 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. జిల్లాలోని 17 మండలాల్లో వరి సాగు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
కూసుమంచి, జూలై 6 : ఎగువ రాష్ట్రంలో వర్షాలు కురుస్తుండడంతో నాగార్జునసాగర్ ఆయకట్టు రైతుల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. ఈ ఏడాది మే నెలలోనే వర్షాలు రావడంతో వానకాలం ముందేవచ్చిందని ఆశపడిన రైతులు పత్తి, మిర్చి, మొక్కలు, పెసర వంటి విత్తనాలు నాటారు. కానీ జూన్ నెల మొత్తం వర్షాలు లేకపోవడంతో విత్తనాలు మొలకెత్తక ఇబ్బందులు పడ్డారు. మళ్లీ గడిచిన పది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో మెట్ట రైతుల మోముల్లో ఆనందం కనిపిస్తున్నది. చనిపోయిన విత్తనాల స్థానంలో మళ్లీ విత్తనాలు విత్తుతున్నారు. సాగర్ ఆయకట్టు కింద ఖమ్మం జిల్లాలో 2.54 లక్షల ఎకరాలు సేద్యమవుతున్నాయి. బోర్లు, బావుల కింద ఇప్పటికే నార్లు పోసుకున్న రైతులు పొలాలను సిద్ధం చేస్తున్నారు. పచ్చిరొట్ట వేసుకొని సాగర్ నీటి కోసం ఎదురుచూస్తున్నారు.
నిరుడు ఆగస్టు మొదటి వారంలో అధికారులు వానకాలం పంటలకు సాగు నీటిని వదిలారు. ఈసారి పరిస్థితులను బట్టి ముందుగానే నీటిని వదిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాలేరు నుంచి కల్లూరు వరకు 2వ జోన్ మొత్తం వరి వేస్తారు. కల్లూరు నుంచి ఎన్టీఆర్ జిల్లా నూజివీడు వరకు 3వ జోన్ కింద కొంతభాగం వరి, మిగిలింది మెట్ట వేస్తారు. మూడో జోన్లో కూడా సుమారు 2.5 లక్ష ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. రైతులు ఇప్పటికే నార్లు పోసుకొని, నారుమడులు సిద్ధం చేసుకొని, పచ్చిరొట్ట వేసుకొని సాగర్ నీటి కోసం ఎదురు చూస్తున్నారు.
జలాశయాల్లో శుక్రవారం నాటికి నిల్వలు ఇలా ఉన్నాయి. పాలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు, 2.558 టీఎంసీలు. కాగా, ప్రస్తుతం 12.50 అడుగుల వద్ద 1.087 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగి ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. 312.045 టీఎంసీల సామర్థ్యం. కాగా, ప్రస్తుతం 520.10 అడుగుల్లో 149.50 టీఎంసీల సామర్థ్యంతో ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు. 215.81 టీఎంసీల సామర్థ్యం. కాగా, ప్రస్తుతం 874 అడుగులతో 160.53 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉంది. జూరాల నీటిమట్టం 1,045 అడుగులు. కాగా, ప్రస్తుతం 1,040 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. అంటే ఇక ఎగువన కురిసే వర్షాలకు వరద వస్తే మొత్తం సాగర్ జలాశయం పూర్తిస్థాయిలో నిండుతుంది. తద్వారా సాగర్ ఆయకట్టుకు కూడా నీరు వదిలే అవకాశం ఉంది.