జూలూరుపాడు, మే 6 : అకాల వర్షాలు, గాలిదుమారంతో కళ్ల ముందే ధాన్యం నీటి పాలవుతున్నా.. ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నాంటూ అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం రైతు వేదికలో బుధవారం జరిగిన రైతు సంక్షేమ అవగాహన సదస్సులో చోటు చేసుకుంది. పర్సన్ ఇన్చార్జి శ్రీనివాసరావు, సీఈవో నరసింహారావు, ఎఫ్పీవో అరుంధతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రైతులు అధికారులను ప్రశ్నించి, నిలదీశారు. మొకజొన్న, ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారుల ప్రసంగాన్ని అడ్డుకుంటూ.. క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న కష్టాన్ని కళ్లకు కట్టినట్లు వివరించారు. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు కంటిమీద కునుకు లేకుండా రోజులతరబడి గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం ఎప్పుడు వస్తుందో? పంట ఎటు కొట్టుకుపోతుందోనని తమ కుటుంబ సభ్యులు దిగులు చెందుతున్నా.. అధికారులు ఏమాత్రం పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతు సంఘాలను ఏకం చేసి మహా ధర్నా వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని పలువురు రైతులు స్పష్టం చేశారు.