వైరాటౌన్, జూలై 16 : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రైతు రుణమాఫీ జీవోను తక్షణమే సవరించాలని తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వైరా బస్టాండ్ సెంటర్లో రైతు రుణమాఫీ జీవో కాపీని దహనం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ నిబంధనల్లో తెల్ల రేషన్‌కార్డు, పాస్ పుస్తకాలు, రెన్యువల్, రీషెడ్యూల్, గడువును సవరించి రైతులందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఆధార్‌కార్డు, పాస్‌బుక్, రేషన్‌కార్డు లేని కుటుంబాలు లక్షల్లో ఉంటాయని వారందరికీ అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. భూమి పాస్ పుస్తకాల కోసం ధరణిలో 12 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వ ప్రజాపాలన సర్వేలో తేలిందని గుర్తుచేశారు. రేషన్‌కార్డుల కోసం సైతం దరఖాస్తు చేసుకున్న వారు లక్షల సంఖ్యలో ఉంటారని అన్నారు. ప్రభుత్వం కొర్రీలు పెట్టకుండా ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ వర్తింపజేయాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం వైరా పట్టణ అధ్యక్షుడు మల్లెంపాటి రామారావు, కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, మచ్చా మణి, తోట నాగేశ్వరరావు, సంక్రాంతి నర్సయ్య, మాడపాటి వెంకట్, మాదినేని శ్రీనివాసరావు, గుమ్మా నర్సింహారావు, వడ్లమూడి మధు, యనమద్ది రామకృష్ణ, పాపగంటి రాంబాబు, తోట కృష్ణవేణి పాల్గొన్నారు.