ఖమ్మం, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వానకాలం ముగిసినా రైతుబంధు జాడ కరువైంది. రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసినా కాంగ్రెస్ ప్రభుత్వం నయా పైసా విదల్చలేదు. యాసంగి వచ్చినా డబ్బులు జమ చేయకపోవడంతో జిల్లావ్యాప్తంగా సుమారు 3.10 లక్షల మంది సాగు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.
అప్పులు తెచ్చి పంటలు సాగు చేసిన రైతులు వాటికి వడ్డీలు కట్టలేక తంటాలు పడుతున్నా ప్రభుత్వం మాత్రం రైతన్నలపై కనికరం చూపడం లేదు. బీఆర్ఎస్ అధినేత, గత ముఖ్యమంత్రి కేసీఆర్.. అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతులను ఆదుకోవాలని, భవిష్యత్లో రైతులు అప్పుల జోలికి వెళ్లొద్దనే ఉద్దేశంతో 2018లో రైతుబంధు(పంటల పెట్టుబడి) పథకాన్ని తీసుకొచ్చారు.
పథకం కింద తొలి రెండేళ్లలో ఎకరానికి రెండు సీజన్లకు కలిపి రూ.8వేల చొప్పున రైతుల ఖాతాల్లో డీబీటీ రూపంలో జమ చేశారు. తర్వాత సాగుకు పెట్టుబడి పెరుగుతున్న నేపథ్యంలో 2020 సంవత్సరం నుంచి మరో.2 వేలు పెంచి.. ఎకరానికి రూ.10 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా పథకం అమలు కావడంతో పొరుగు రాష్ర్టాలు సైతం ఈ పథకంపై అధ్యయనం చేశాయి. చివరికి కేంద్ర ప్రభుత్వం సైతం ‘పీఎం కిసాన్’ పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన సందర్భం ఉంది.
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ‘రైతు భరోసా’ పేరుతో ఎకరానికి రూ.15 వేల చొప్పున అందజేస్తామని రైతులకు హామీ ఇచ్చింది. తీరా అధికారం చేపట్టిన తర్వాత నాటి నుంచి రైతు భరోసా అమలును వాయిదాల పేరుతో కాలయాపన చేస్తూ వస్తున్నది. ఈ క్రమంలో వానకాలం ముగిసి.. యాసంగి వచ్చినా రైతు భరోసా అమలు మాత్రం ఏకోశాన కనిపించడం లేదు. సర్కార్ నుంచి ఏమాత్రం సాయం అందకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై కర్షకులు మండిపడుతున్నారు. నమ్మించి నట్టేట ముంచారని వాపోతున్నారు.
రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ సర్కార్ తీరుపై, ఆపదలో ఉన్న రైతులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు రుణమాఫీ ఇప్పట్లో చేయలేమని చెప్పడంతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ నాయకులు.. రైతులు, రైతు సంఘం నాయకులతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలతోపాటు పార్టీ ముఖ్య నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, రైతు సమన్వయ కమిటీ మాజీ బాధ్యులు, రైతు సంఘాల నాయకులు పాల్గొననున్నారు.