మధిర, మే 03 : ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు శనివారం మధిర మార్కెట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వారం రోజుల క్రితం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చినప్పటికీ మిల్లర్లు కొనుగోలు చేయడం లేదని, దీనివల్ల అకాల వర్షంతో ధాన్యం తడిచిపోతుందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మధిర-విజయవాడ ప్రధాన రోడ్డు మార్గంలో రైతులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు పాపినేని రామనరసయ్య, శీలం నరసింహారావు మాట్లాడుతూ.. మిల్లర్లు రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయడం లేదని, అధికారులు వెంటనే స్పందించి కొనుగోళ్లు ప్రారంభించాలన్నారు.
అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పడమే తప్పా కొనుగోలు చేసింది లేదన్నారు. రైతుల సమస్యను పరిష్కరించేంతవరకు ధర్నా కొనసాగుతుందని హెచ్చరించారు. రైతుల ధర్నా కారణంగా మధిర-విజయవాడ ప్రధాన రోడ్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. సమస్యను పరిష్కరించడం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడుతామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమింపజేశారు.
Madhira : మధిర-విజయవాడ ప్రధాన రహదారిపై రైతల ధర్నా