జూలూరుపాడు, ఏప్రిల్ 8: ఎలాంటి షరతులు లేకుండా, ఆంక్షలు విధించకుండా ధాన్యం, మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు జూలూరుపాడు సొసైటీ కొనుగోలు కేంద్రం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంట ఉత్పత్తులను వెంటనే కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి చండ్ర నరేంద్ర కుమార్ మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం వల్ల కొనుగోలు కేంద్రాల్లో వేలాది బస్తాల ధాన్యం, మక్కలు అకాల వర్షాలకు తడిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులు నాణ్యమైన సరుకు తెచ్చినప్పటికీ తేమ శాతం, తాలు, రంగు మారిందని సాకులు చెబుతూ అధికారులు రైతులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఒకవైపు అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు, మరోవైపు కొనుగోళ్లలో జాప్యంతో అన్నదాతలు ఆగమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోళ్లు సక్రమంగా జరగకపోవడంతో గత్యంతరం లేక దళారులకు పంటను అమ్ముకొని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే షరతులు లేకుండా పంట ఉత్పత్తులు కొనుగోలు చేయాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా, రైతుల ఆందోళన వద్దకు చేరుకున్న తహసీల్దార్ శ్రీనివాస్, సొసైటీ ఉద్యోగులు రైతులతో మాట్లాడారు. వీలైనంత త్వరగా కొనుగోళ్లు చేపడుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి యాస రోశయ్య, నాయకులు ఎల్లంకి మధు, తూము కోటయ్య, సిరిపురపు వెంకటేశ్వర్లు, గార్లపాటి వీరభద్రం, ఎల్లంకి శీను, వెంకటేశ్వర్లు, రైతులు పాల్గొన్నారు.