కారేపల్లి, ఆగస్టు 23: యూరియా బస్తాల కొరతపై ఖమ్మం జిల్లా సింగరేణి (Karepally) మండల కేంద్రంలో రైతులు ఆందోళన చేపట్టారు. శనివారం ఉదయం బస్టాండ్ సెంటర్లో రోడ్డుపై బైఠాయించిన రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ రైతులకు సరిపడా యూరియా అందజేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది యూరియా కొరత ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు సాగు చేసే సమయంలో యూరియా దొరకకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని మండిపడ్డారు.
జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదని చెప్తున్న ప్రజా ప్రతినిధులు, అధికారులకు రైతులు పడుతున్న కష్టాలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. సొసైటీలో ఒక్క రైతుకు ఒక యూరియా బస్తానే ఇస్తున్నారన్నారు. ఒక్క బస్తాతో పంటలు ఎలా సాగు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా మంత్రులు, అధికార యంత్రాంగం స్పందించి వెంటనే రైతులకు సరిపడా యూరియా ఎరువులను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అక్కడకు చేరుకున్న మండల వ్యవసాయ శాఖ అధికారి బట్టు అశోక్ కుమార్, ఎస్ఐ బైరు గోపి రైతులకు సర్ది చెప్పి ఆందోళన విరమించే ప్రయత్నం చేశారు.