మధిర రూరల్, సెప్టెంబర్ 12: అమరావతి – నాగ్‌పూర్ గ్రీన్‌ఫీల్డ్ హైవే మార్గంలో అండర్ పాస్ ఎత్తు పెంచాలని డిమాండ్ చేస్తూ సిరిపురంలో రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు గ్రీన్‌ఫీల్డ్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు చావా వేణు మాట్లాడుతూ అండర్ పాస్ వద్ద ప్రస్తుతం ఉన్న ఎత్తు భారీ వాహనాల రాకపోకలకు సరిపోదన్నారు.
సిరిపురం ఎండపల్లి గట్టు వద్ద నిత్యం భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని, ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ పారు ఏర్పాటుకు కూడా శంకుస్థాపన జరిగిందన్నారు. రానున్న రోజుల్లో ఈ మార్గం మీదుగా భారీ ట్రక్కులు, లారీల రాకపోకలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందని, ఈ నేపథ్యంలో అండర్ పాస్ ఎత్తు పెంచడం వల్ల రైతులు, వ్యాపార లావాదేవీలకు అనుకూలంగా ఉంటుందన్నారు. తమ డిమాండ్‌ను పరిషరించే వరకూ పోరాటం కొనసాగిస్తామని రైతులు హెచ్చరించారు. సిరిపురం, మిట్టగూడెం చుట్టుపకల గ్రామాల రైతులు పాల్గొన్నారు.