లక్ష్మీదేవిపల్లి/ టేకులపల్లి/ తల్లాడ, జూలై 25 : ఎరువుల కోసం రైతన్నలు ఈ సీజన్ ప్రారంభం నుంచీ నానా అగచాట్లు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి దాపురించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం కేంద్రంలోని మార్కెట్ కమిటీ గోడౌన్ దగ్గరకు రైతులు ఎరువుల కోసం శుక్రవారం ఉదయం 6గంటలకే చేరుకున్నారు. అధికారులు, సిబ్బంది ఆలస్యంగా రావడంతో బంగారుచెలక, తోకబందాల, మైలారం, గట్టుమల్ల గిరిజన గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్కో రైతుకు మూడు బస్తాల చొప్పున ఎరువులు అందించాల్సి ఉండగా రెండు బస్తాలే ఇచ్చినట్లు రైతులు వాపోయారు. డీఏపీ తీసుకుంటేనే యూరియా ఇస్తున్నారని, 20-20 ఎరువు స్టాక్ లేదని పేర్కొన్నారు.
టేకులపల్లి మండల కేంద్రంలోని బేతంపూడి పీఏసీఎస్ వద్ద శుక్రవారం రైతులు యూరియా కోసం నానా ఇబ్బందులు పడ్డారు. ఎరువుల కోసం ఎగబడటం, క్యూ కట్టడం చూస్తుంటే పాతరోజులు గుర్తుకొసున్నాయని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎరువుల కోసం ఎన్నడూ ఇలా కష్టాలు పడలేదని రైతులు తెలిపారు.
ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలోని సహకార సొసైటీ కార్యాలయంలో యూరియా కోసం రైతులు ధర్నాకు దిగారు. శుక్రవారం ఉదయాన్నే సొసైటీ కార్యాలయానికి పెద్దఎత్తున సుమారు 400మంది రైతులు చేరుకున్నారు. తల్లాడ సొసైటీకి లారీలో 200 కట్టలు మాత్రమే వచ్చాయని, వాటిని మాత్రమే పంచుతామని మిగిలిన 200 కట్టలను వేరేచోటుకు తరలించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు లారీని వెళ్లకుండా అడ్డుకున్నారు. 200 బస్తాలు సరిపోవని లారీలో ఉన్న మొత్తం 400 బస్తాలు ఇక్కడే దింపాలని ధర్నా చేశారు.
విషయం తెలుసుకున్న తహసీల్దార్ బాబ్జిప్రసాద్, ఏవో తాజుద్దీన్ అక్కడకు చేరుకొని లోడ్ మొత్తం అక్కడే దింపుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆధార్‌కార్డు, రైతుపట్టా పాస్‌పుస్తకం ఉన్న రైతులకు ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేశారు. కౌలు రైతులకు ఇవ్వడం కుదరదని అధికారులు తేల్చిచెప్పడంతో వారు నిరాశతో వెనుదిరిగారు. కార్యక్రమంలో రైతులు కుపాటి శ్రీనివాసరావు, పులబాల నరసింహారావు, తాటిపల్లి శ్రీనివాసరావు, నల్లగట్ల నాగేశ్వరరావు, జమలారెడ్డి, కొట్టేటి సుబ్బారెడ్డి, ముక్క తిరుపతిరావు, చీరాల వెంకటేశ్వర్లు, పూల్ జ్యోతి, తొండపు మంగేశ్వరి, రేగళ్ల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సరిపడా ఎరువులను సరఫరా చేయాలి. ఎరువుల విషయంలో అన్నదాతలకు ఇబ్బంది కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ఎరువులను రైతులకు సకాలంలో అందజేస్తేనే పంటలు బాగా పండుతాయని గుర్తుంచుకోవాలి.
– వెంకటేశ్వర్లు, గట్టుమల్ల, లక్ష్మీదేవిపల్లి మండలం
రైతులందరూ ఉదయం ఆరుగంటల నుంచే మార్కెట్ యార్డులో పడిగాపులు కాశారు. అధికారులు, సిబ్బంది సమయానికి రాకపోవడంతో రోజంతా ఇక్కడే గడిచిపోతుంది. అధికారులు సమయపాలన పాటించాలి. రైతులు కోరిన ఎరువులను అందజేయాలి.
– సపావత్ వంశీ, సీతారాంపురం, లక్ష్మీదేవిపల్లి మండలం