ఖమ్మం, జనవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ సర్కారుపై కర్షకులు కన్నెర్రజేశారు. రైతుభరోసా కోతలపై భగ్గుమన్నారు. రైతుభరోసా పేరిట అన్నదాతలకు పంటల పెట్టుబడి సాయాన్ని రూ.15 వేలు ఇస్తామంటూ నమ్మబలికి ఓట్లు కొల్లగొట్టిన కాంగ్రెస్ పెద్దలు.. ఇప్పుడు ఆ సాయాన్ని రూ.12 వేలు మాత్రమే ఇస్తామంటూ మాటతప్పడంపై రైతులు ఆగ్రహంతో రగిలిపోయారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు అన్నదాతలతో కలిసి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కదం తొక్కారు. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా సోమవారం ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నాలకు దిగారు.
రహదారులపై రాస్తారోకోలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ప్రకటించిన మాదిరిగా రైతుభరోసాను అందజేయాల్సిందేనని అన్నదాతలు డిమాండ్ చేశారు. తమకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ముక్తకంఠంతో నినదించారు. మాయమాటలు చెప్పి రైతులతో ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ నాయకులు మాట నిలుపుకోకపోతే గ్రామాల్లో తిరగనివ్వబోమని హెచ్చరించారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగా ఎలాంటి ఆంక్షలు, షరతులు లేకుండా పంటల పెట్టుబడి పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఉదయం 10 గంటల నుంచి మొదలుకొని మధ్యాహ్నం 2 గంటల వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. అనంతరం ఆయా మండలాల్లో రెవెన్యూ అధికారులకు రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రాలు అందజేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తల్లాడలో జరిగిన నిరసనలో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యానికి ప్రకటించిన బోనస్‌ను అన్ని రకాల పంటల రైతులకూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులతో కలిసి భారీ ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు.
ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. కల్లూరులో మాజీ ఎంపీపీ బీరెల్లి రఘు, మాజీ జడ్పీటీసీ కట్టా బాబు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. బోనకల్లులో రైతులు, బీఆర్ఎస్ నాయకులు కలిసి ఆందోళన చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అశ్వారావుపేటలో న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఇల్లెందు రూరల్ మండలంలో బీఆర్ఎస్ నాయకులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆంక్షలు లేకుండా రైతుభరోసా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
టేకులపల్లిలోనూ బీఆర్ఎస్ నేతలు బొమ్మెర వరప్రసాద్, లక్కినేని సురేందర్‌రావు రైతులతో నిరసనకు దిగారు. వేంసూరులో మాజీ ఎంపీపీ వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. దుమ్ముగూడెంలో బీఆర్ఎస్ నాయకులు కణితి రాముడు, ఎండీ జానీపాషా, రైతులు; పెనుబల్లిలో పార్టీ నేతలు కనగాల వెంకట్రావ్, భూక్యా ప్రసాద్, మాజీ ఎంపీపీ లక్కినేని అలేఖ్య, రైతులు కలిసి ధర్నా చేశారు. మధిరలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. సత్తుపల్లిలో జరిగిన నిరసన కార్యక్రమానికి సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపుడి మహేశ్ హాజరయ్యారు.
ఇల్లెందు పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు భారీ ర్యాలీ చేపట్టారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. మణుగూరులోనూ బీఆర్ఎస్ నాయకులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. ముదిగొండలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు కలిసి ధర్నా చేసి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. నేలకొండపల్లిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య ఆధ్వర్యంలో, భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో పార్టీ మండల అధ్యక్షుడు కొట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. లక్ష్మీదేవిపల్లిలో దున్నపోతుకు వినతిపత్రం అందజేసి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.