చండ్రుగొండ, జూలై 3 : యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. సహకార సొసైటీ కేంద్రాల వద్ద రోజంతా పడిగాపులు కాస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న వారికి మాత్రమే యూరియాను అందిస్తుండడంతో అన్నదాతల కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయి. అసలు ఆన్లైన్, సొసైటీలు, షాపుల్లో యూరియా అందుబాటులో ఉండకపోవడం, ఉన్న యూరియా సైతం అర్ధగంటలోనే అయిపోతుండడంతో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని గానుగపాడు సొసైటీ కార్యాలయంలో వద్ద యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడ్డారు. ఆండ్రాయిడ్ సెల్ లేకపోవడం, అవగాహన లేకపోవడంతో కొంతమంది రైతులు సహకార కార్యాలయం వద్దకు వచ్చి రోజంతా పడిగాపులు కాశారు. చిన్న సెల్‌తో యాప్‌లో బుక్ చేయటానికి లేక దిగాలుగా కూర్చున్నారు. యాప్‌తో పనిలేకుండా నేరుగా రైతులకు యూరియాను అందించాలని అన్నదాతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.