ఖమ్మం వ్యవసాయం, అక్టోబర్ 27: బహిరంగ మార్కెట్లో తెల్ల బంగారం ధరలు తిరోగమనం దిశకు చేరుతుండడంతో పంటను సాగు చేసిన రైతులు చిత్తు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాణిజ్య పంటల్లో ఎక్కువ డిమాండ్ ఉన్న పత్తిని ఉమ్మడి జిల్లా రైతులు గడిచిన కొన్నేళ్లుగా ప్రధాన పంటగా సాగు చేస్తున్నారు. అనువైన నేలలు పుష్కలంగా ఉండడంతో దశాబ్దాలుగా రైతులు పత్తి సాగుకు ప్రాధాన్యమిస్తున్నారు. అదే తరహాలో ఈ ఏడాది కూడా ఏకంగా 2.10 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేశారు. సాగు ఆరంభంలో భౌగోళిక, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడం, గులాబీరంగు పురుగు ఉధృతి కూడా లేకపోవడం వంటి కారణాలతో రైతులు రెట్టింపు ఉత్సాహంతో సస్యరక్షణ చర్యలు చేపట్టారు.
తీరా పంట పూత, కాత దశకు చేరుకునే సమయంలో ఒక్కసారిగా వరుస తుపాన్లు, రికార్డు స్థాయి వర్షాలు, భారీ వరదలు వచ్చాయి. దీంతో పంటపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులకు నిరాశ ఎదురైంది. వరదల కారణంగా కొన్ని మండలాల్లో ఈ పంట మొత్తానికే తుడిచిపెట్టుకుపోయింది. వర్షాలను తట్టుకొని పంట నిలిచిన ప్రాంతాల్లో పత్తి చీడపీడల ఆశించడం వంటివి ఒక్కసారిగా పెరిగాయి. దీంతో పంటను కాపాడుకునేందుకు రైతులకు మరింత పెట్టుబడి భారం పెరిగింది.
అప్పటికే మార్కెట్లో పత్తి ధర క్వింటాకు రూ.8 వేల వరకు పలుకుతుండడంతో మద్దతుకు మంచి ధర వచ్చే అవకాశం ఉందని రైతులు అంచనా వేశారు. తీరా కొత్త పంట మార్కెట్‌కు చేరుకునే సమయంలోనే ప్రైవేట్ ఖరీదుదారులు వారి మాయాజాలానికి తెరతీశారు. దీంతో నెల రోజుల నుంచి పత్తి ధరలు పతనమవుతూ వస్తున్నాయి. పేరుకు మాత్రం ఒకటీ రెండు లాట్లకు గరిష్ఠ ధర ఆన్లైన్లో బిడ్డింగ్ చూపుతున్నారు. మిగిలిన పంటకు రూ.5,500 నుంచి రూ.6,500 వరకే ధర పెడుతున్నారు. అయితే భారత పత్తి సంస్థ (సీసీఐ) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే మరింత ప్రయోజనం ఉంటుందని భావించిన అధికారుల అంచనాలు కూడా తలికిందులవుతున్నాయి.
గడిచిన మూడు నాలుగు దశాబ్దాలుగా జిల్లాలో పత్తిసాగు గణనీయంగా పెరుగుతోంది. మార్కెటింగ్‌కు అనువైన అవకాశాలు, జిన్నింగ్ మిల్లులు ఉండడంతో ఇదే అదునుగా భావించి రైతులు.. తెల్లబంగారం సాగు చేస్తున్నారు. అయితే రాన్రానూ బీటీ విత్తనాల్లో నాణ్యతా లోపం, కాస్త భిన్నమైన వాతావరణం కారణంగా ఈ ఏడాది తీవ్రనష్టాలను మిగిల్చింది. సాధారణంగా ఎకరానికి పంట సాగు దిగుబడి 10 – 15 క్వింటాళ్లు వస్తుంది. అయితే ఈ ఏడాది ఎకరానికి 4 – 5 క్వింటాళ్లు మాత్రమే వస్తుందని రైతులు చెబుతున్నారు. దీంతో సాగుకు పెట్టిన పెట్టుబడి ఖర్చులు కూడా పూడే అవకాశం లేదని వాపోతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఎకరానికి రూ.15 వేల కౌలు చెల్లించి, మరో రూ.30 వేలు పెట్టుబడి పెట్టి పత్తిని సాగు చేస్తే.. కనీసం సగానికి సగం కూడా ఆదాయం వచ్చే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేట్ మార్కెట్లో రైతులకు మద్దతు ధర రావడం కష్టమని భావించిన సర్కారు.. సీసీఐ కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయినప్పటికీ అక్కడ ఆశించిన మేర ప్రయోజనం కలగడం లేదు. సీసీఐ మార్గదర్శకాల ప్రకారం పంటలో తేమ శాతం 8 12 శాతం మాత్రమే ఉండాలి. అయితే జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వల్ల, మరికొద్ది రోజుల్లో మంచు, చలి తీవ్రత పెరిగే ప్రమాదం ఉన్నందు వల్ల 12 శాతంలోపు తేమ నమోదయ్యే అవకాశాలు తక్కువని జిన్నింగ్ మిల్లుల యజమానులు పేర్కొంటున్నారు.
ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ వ్యాపారులు సుమారుగా 5 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. అయితే ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 9 జిన్నింగ్ మిల్లులను సీసీఐ నోటిఫై చేసింది. అయితే ప్రస్తుతం కేవలం 3 జిన్నింగ్ మిల్లుల వద్ద మాత్రమే పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయి. వాటి పరిధిలో 33 మెట్రిక్ టన్నుల పంటను మాత్రమే సీసీఐ కొనుగోలు చేసింది. అయితే, తరుగు తీస్తేనే పంటను కొనుగోలు చేస్తామన్న ఒప్పందంతో మాత్రమే ఆ పంటను సీసీఐ బయ్యర్లు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. దీంతో ‘సీసీఐ కేంద్రాలు ఉన్నా.. మద్దతు ధర సున్నా..’ అనే పరిస్థితి ఎదురవుతోంది.
జిల్లా మార్కెటింగ్ శాఖ పరిధిలోని ఖమ్మం, ఏన్కూరు, మధిర వ్యవసాయ మార్కెట్లలో ప్రస్తుతం ప్రైవేట్‌లో పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయి. ప్రధానంగా ఖమ్మం ఏఎంసీలో భారీగా క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. కొత్త పంట మార్కెట్‌కు వచ్చే సమయంలో గరిష్ఠ ధర రూ.8 వేలకు పైగానే పలికింది. తేమ శాతంతో సంబంధం లేకుండానే ఖరీదుదారులు పత్తిని కొనుగోలు చేశారు. అయితే, సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కావడం, అందులో అనేక కొర్రీలు పెడుతుండడం వంటి కారణాలతో రైతులు మళ్లీ ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
సీసీఐ మద్దతు ధర గరిష్ఠంగా రూ.7,520 కాగా.. ప్రైవేట్‌లో గరిష్ట ధర కేవలం రూ.7 వేలు మాత్రమే. దాదాపుగా పక్షం రోజులుగా ఖమ్మం ఏఎంసీ పత్తియార్డులో దీనినే గరిష్ఠ ధరగా నమోదు చేస్తున్నప్పటికీ.. ఎక్కువమంది రైతుల దగ్గర రూ.5,500 నుంచి రూ.6,500కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఈనామ్ ద్వారా ప్రైవేట్‌లో పత్తి కొనుగోళ్లు జరుగుతున్నప్పటికీ పెద్ద వ్యాపారులు కుమ్మక్కై సిండికేట్‌గా మారి పంటను కొనుగోలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అటు సీసీఐలో కొర్రీలు, ఇటు ప్రైవేట్‌లో సిండికేట్ దందా వంటి కారణాలతో ‘రెంటికి చెడ్డ రేవడి’లా పత్తి రైతుల పరిస్థితి మారింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పత్తి పంట.. రైతులను కోలుకోని దెబ్బతిసింది. దిగుబడి పూర్తిగా తగ్గడం, మద్దతు ధర దక్కకపోవడం వంటివి రైతులను ఆగమాగం చేశాయి. ఈ పరిస్థితిలో రైతుకు సర్కారు సహాయం అందిస్తేనే వ్యవసాయం బాగుపడుతుంది. కానీ, ఈ ఏడాది సర్కారు నుంచి నయా పైసా సాయం అందలేదు. రైతుబంధు రాలేదు. రుణమాఫీ కాలేదు. ఈ ఏడాది ఐదు ఎకరాల్లో పత్తిని సాగు చేశాను. మొదటి దశలో 20 బస్తాలు మాత్రమే వచ్చింది. తీరా పంటను మార్కెట్‌కు తీసుకొస్తే వ్యాపారులు క్వింటాకు రూ.6,900కు మాత్రమే కొన్నారు.
-ఎస్కే నాగుల్‌మీరా, లచ్చగూడెం, చింతకాని