జూలూరుపాడు, మే 10: రైతే దేశానికి వెన్నెముక అని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. చివరికి రైతువెన్నే విరిచిందని ఓ రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది ఇందిరమ్మ రాజ్యమని, రైతురాజ్యమని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పాలకులు.. రైతునడ్డి విరిచేసిందని మండిపడ్డారు. రైతులను నిలువునా మోసం చేస్తున్న రేవంత్ ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కారేనని చేశారు. భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన రైతులు 25 రోజుల క్రితం తమ వరి పంటను కోశారు. పొరుగునే పడమట నర్సాపురంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రానికి తమ పంటను తెచ్చారు.
ఇప్పటికీ అక్కడ కొనుగోలు చేపట్టలేదు. ‘క్వింటాకు తరుగు (తారం) కింద మూడు కేజీల వడ్లు, అదనంగా మరో పది కేజీలు వడ్లు ఇస్తేనే మిల్లర్లు కొంటామని చెబుతున్నారు. లేదంటే కొనబోమని స్పష్టం చేస్తున్నారు. అందుకని రైతులు కూడా అలా ఇస్తేనే ఈ ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు చేపడతాం. లేదంటే లేదు.’ అంటూ అధికారులు ఇటీవల తేల్చిచెప్పారు. దీంతో అదే మండలం కాకర్ల గ్రామానికి చెందిన రైతు మిర్యాల దేవకుమార్.. ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారును, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని, అధికారులను కడిగిపారేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా సోషల్‌మీడియాలో వైరల్ అయింది. సదరు వీడియోలో ఆ రైతు ప్రభుత్వానికి వేసిన ప్రశ్నలు ఆయన మాటల్లోనే..
‘తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ రైతులం మేము. మా పొరుగు గ్రామంలో ఉన్న పడమట నర్సాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇందులో క్వింటా ‘ఏ-గ్రేడ్’ ధాన్యాన్ని రూ.2,389, కామన్ గ్రేడ్ ధాన్యాన్ని రూ.రూ.2,369 చొప్పున కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే, సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ కూడా ఇస్తామని రేవంత్ ప్రభుత్వం చెప్పింది. అదే ధరలతో కూడిన బ్యానర్ కూడా ఇక్కడ పెట్టింది. కానీ అధికారులు మాత్రం ఇక్కడ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు.
ఎందుకంటే అధికారులు, మిల్లర్లు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారు. క్వింటా వడ్లకు అదనంగా తరుగు కింద మూడు కేజీల వడ్లు, ఇంకా అదనంగా మరో పది కేజీల వడ్లు ఇస్తేనే కొంటామని మిల్లర్లు స్పష్టం చేస్తున్నట్లుగా అధికారులు చెప్పారు. ఈ ధరలకు ధాన్యం కొనకుండా అధికారులు, మిల్లర్లు కలిసి రైతులను మోసం చేస్తున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతే దేశానికి వెన్నెముక అని చెబుతూనే ఈరోజు రైతు వెన్ను విరిచేసింది. రూ.2389 మద్దతు ధరను, మరో రూ.500 బోనస్‌ను ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పుడు అసలు వడ్లే కొనుగోలు చేయము అని చెబుతోంది.
మరి ఇప్పుడు రైతులు ఏం కావాలి? రైతులు పంటను కొసి కొనుగోలు కేంద్రానికి తెచ్చి 25 రోజులుగా కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తున్నా అధికారులు, ప్రభుత్వం కొనడం లేదు. కాబట్టి రైతులందరూ గత్యంతరంలేక ప్రైవేటు వాళ్లకు అమ్ముకుంటున్నారు. క్వింటా వడ్లను రెండు కేజీల తరుగు చొప్పున కేవలం రూ.1,300కే తెగనమ్ముకుంటున్నారు. అంటే ప్రభుత్వం ప్రకటించిన ధరలో సగానికి సగం తక్కువకు అమ్ముకొని అన్నదాతలు నష్టపోతున్నారు.
దేశానికి వెన్నెముక అని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇదే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. రైతులందరి వెన్ను విరిచేసింది. రైతులను మోసం చేసిన ప్రభుత్వమిది. ఇందిరమ్మ రాజ్యమన్నారు.. రైతుల రాజ్యమన్నారు.. చివరికి రైతుల వెన్నెముకనే విరిచేశారు. అధికారులు, డీసీసీబీ చైర్మన్, డీసీసీబీ సీఈవో, డీసీసీబీ కార్యదిర్శ, మిల్లర్లు కలిసి కుమ్మక్కయ్యారు. రైతుల దగ్గర అదనంగా పది కేజీల తరుగు తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని, రైతుల బాధలను ప్రజాప్రతినిధులు, వార్డు మెంబర్లు, సభ్యులు, చివరికి ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా రైతుల పట్ల దయ ఉంచి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం.’ అంటూ ముగించారు.